వారం కింద వరకు రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంది. అకాల వర్షాల వల్ల అంతటా కూల్ కూల్‌గా ఉండేది. కానీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు భానుడు భగభగమంటున్నాడు. ఎండల తాకిడిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వారం రోజుల కింద రాష్ట్రంలోని చాలా చోట్ల అకాలు వర్షాలు పడ్డాయి. దీంతో వాతావరణం చల్లగా అనిపించింది. కానీ ఇప్పుడు భానుడి భగభగలతో టెంపరేచర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోవడంతో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు ఉక్కపోత, వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మోకా తుఫాను ప్రభావం వల్ల హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న పది రోజులు వేడిగాలుల ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రాబోయే మూడ్రోజులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. తేమ శాతం పెరగడం వల్ల రాత్రులు కూడా అసౌకర్యంగా మారే ఛాన్స్ ఉందని తెలిపారు. ఎండలు, వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ బయటికి రావొద్దని అధికారులు సూచించారు. ఏమైనా పనులు ఉంటే పొద్దున పూట లేదా సాయంత్రం సమయాల్లో చేసుకుంటే మేలు అని పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆఫీసర్స్ కోరారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.