ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో ఓమిక్రాన్ వేరియెంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే పలు కఠినమైన ఆంక్షలు విధించాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. తాజాగా ఈ ఓమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ నిబంధనలు కట్టుదిట్టం చేసింది. నో మాస్క్ – నో ఎంట్రీ ఆదేశాలతో రైల్వే అధికారులు ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు విస్తృతం చేశారు.
అలాగే రైల్వే ప్రయాణికులకు కూడా రైల్వే శాఖ ఖచ్చితమైన మార్గ దర్శకాలను జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులకు జరిమానా విధించారు. టికెట్ ఉన్నప్పటికీ మాస్క్ లేకపోతే మాత్రం బయటికి పంపించడంతో పాటు రూ.500/- పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ రాకేష్ తెలియజేసారు.
దేశంలో రోజురోజుకి ఓమిక్రాన్ వేరియెంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అంతు చిక్కకుండానే దేశమంతటా వ్యాపిస్తున్న ఈ వేరియెంట్ జనాలను వణికిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో 10 కేసులు, జైపూర్ ఒకే ఫామిలీలో 9 మందికి ఓమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతానికి దేశంలో ఓమిక్రాన్ నమోదైన వారిలో ఎక్కువగా ఆఫ్రికాలో పర్యటించిన వారున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించినట్లు సమాచారం.