ఉత్తర్ ప్రదేశ్- ఈ ప్రపంచంలో ఒక్కోసారి భలే విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం అస్సలు నమ్మలేని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. మనం నమ్మవేకపోయినా మన కళ్లముందు సాక్షాత్సరిస్తుంటే మనం మాత్రం ఏంచేయగలం చెప్పండి. అందరితో పాటు మనం కూడా నోరెల్లబెట్టడం తప్ప. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగి ఓ ఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అసలేం జరిగిందంటే.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెల్చేశారు. ఇంకేముంది అతని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలోని మార్చూరి గదిలోని ఫ్రీజర్ లో పెట్టారు అతని డెడ్ బాడీనీ. కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెడ్ బాడీని పరిశీలిస్తుండగా అతడు కదిలినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో వెంటనే అతడిని ఐసీయులోకి తీసుకెళ్లి వైద్యం అందించారు.
ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. శ్రీకేశ్ కుమార్ అనే వ్యక్తికి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో, బంధువులు శుక్రవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐతే అతను అప్పటికే చనిపోయాడని నిర్ధారించిన డాక్టర్లు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులకు సూచించారు. దీంతో శ్రీకేశ్ డెడ్ బాడీని సర్కార్ దవాఖానాకు తరలంచగా, అక్కడ రాత్రంతా దాదాపు 6 గంటల పాటు మార్చురీ ఫ్రీజర్లో ఉంచారు.
తెల్లవారుజామున పంచనామాకు పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అతను బతికే ఉన్నట్లు గమనించారు. ఏ మాత్రం అలస్యం చేయకుండా అతడిని ఆస్పత్రి ఐసీయులోకి షిఫ్ట్ చేసి ట్రీట్ మెంట్ ప్రారంభించారు వైద్యులు. శ్రీకేశ్ ఇంకా కోమాలో ఉన్నాడని తేల్చిన డాక్టర్లు, బతికే ఉన్న మనిషిని చనిపోయినట్లు ఎలా నిర్ధారిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మొత్తానికి శ్రీకేశ్ బతికే ఉండటంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేదు.