హైదరాబాద్- ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతికి హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో విజయశాంతి పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు దాన్నికొట్టేసింది. దీంతో విజయశాంతికి నిరాశ ఎదురైంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.
ప్రభుత్వ భూముల విక్రయానికి కేసీఆర్ సర్కార్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపేలా ఆదేశించాలని విజయశాంతి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. నిధుల కోసం రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారంటూ ఆమె గత సంవత్సరం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం, ప్రభుత్వం తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమని తేల్చిచెప్పింది.హైదరాబాద్ శివారులోని కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసి పిటిషన్‌పై గురువారంహైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రభుత్వం తమ భూములు అమ్ముకోకుండా ఉండేందుకు చట్టపరంగా ఉన్న నిబంధనలను పిటిషనర్ కోర్టుకు తెలపలేదని ధర్మాసన పేర్కొంది. అందుకని ప్రభుత్వ భూముల విక్రయానికి తాము అభ్యంతరం చెప్పలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదే సందర్బంలో ప్రభుత్వ భూముల విక్రయంలో టెండర్లు, ఈ వేలం వంటి పారదర్శక విధానాలు పాటించాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది.