పెద్దపల్లి- హత్య.. సాధారనంగా శత్రువులను హత్య చేస్తుంటారు.. లేదంటే క్షణికావేశంలో, తాగిన మైకంలో కుటుంబ సభ్యులను చంపుతున్న ఘటనలను ఈ మధ్య చూస్తున్నాం. కానీ తాగి వేధిస్తుండటంతో కన్న కొడుకునే హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అవును కన్నకొడుకును కొట్టి చంపేశాడో కసాయి తండ్రి. ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో ఆ తండ్రి భరించలేకపోయాడు. విచక్షణ కోల్పోయి అతి దారుణంగా హత్య చేశాడు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన మేడం శంకరయ్య కొడుకు రాజ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు.
ప్రతి రోజు తాగొచ్చి తండ్రితో గొడవపడి, వేధించేవాడు.ఎప్పటిలాగే నిన్న రాత్రి పీకలదాకా మధ్యం తాగొచ్చి గొడవపడడంతో ఓపిక నశించిన శంకరయ్య కర్రతో కొడుకు తలపై బలంగా కొట్టాడు. దెబ్బ గట్టిగా తగలడంతో రాజ్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలాడు. కాసేపటికి అక్కడే ప్రాణాలు విడిచాడు. గ్రామస్తుల ద్వార సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
రాజ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దపల్లి హాస్పిటల్ కు తరలించారు. మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక కన్నతండ్రి శంకరయ్య కొట్టి హత్య చేశాడని సీఐ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.