ప్రముఖ గజల్ రచయిత్రి బైరి ఇందిర ఇకలేరు. చిన్నతనం నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆమె.. సుమారు 600లకు పైగా గజల్స్ రాశారు. క్యాన్సర్ తో పోరాడుతున్నా ఆమె చివరి వరకు తన ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. చావు తనకు తప్పదని భావించిన తాను గజల్స్ రాయడం మానలేదు.
ప్రముఖ గజల్ రచయిత్రి బైరి ఇందిర (61) ఆదివారం కన్నుమూశారు. కవయిత్రిగా, గజల్ రచయిత్రి సాహిత్య సామ్రాజాన్ని ఏలిన ఆమె హైదరాబాద్ కూకట్ పల్లిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మహమ్మారి క్యాన్సర్ ఆమెను కబలించింది. క్యాన్సర్ తో పోరాడుతున్నా ఆమె చివరి వరకు తన ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. చావు తనకు తప్పదని భావించిన తాను గజల్స్ రాయడం మానలేదు. అభ్యుదయ భావాలు, సాంఘిక దురాచారాలు, కుల వివక్ష, మహిళలపై వేధింపులపై గజల్స్ ద్వారా అవగాహన కల్పించేవారు. ఇందిరా 600కు పైగా గజల్స్ రాశారు. తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు పేరుతో గజల్స్ సంకలనాన్ని తీసుకొచ్చారు. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమం, సాయుధ పోరాటంపై అనేక గజల్స్ రాశారు.
ఆమె స్వస్థలం కొత్త గూడెం జిల్లాలోని ఇల్లందు. ఆమె విద్యాభ్యాసం వరంగల్, హైదరాబాద్‌లలో సాగింది. తండ్రి బైరి రామ్మూర్తి ప్రోత్సాహంతో చిన్పప్పటి నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకన్నారు. పెళ్లయ్యాక భర్త రామ శంకరయ్యతో కలిసి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. సుమారు 20 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆమె కొనసాగారు. ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేశారు. తెలంగాణ గజల్ సాహిత్యానికి విశేష కృషి చేశారు బైరి ఇందిర. మహిళా గజల్స్ రచయితల్లో తొలిసారిగా గజల్స్ సంకాలను విడుదల చేసి ఆమె చరిత్ర సృష్టించారు. వృత్తిరిత్యా ప్రధానోపాధ్యాయురాలు అయిన ఆమె.. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే తీరిక సమయాల్లో గజల్స్ రాశారు. తెలంగాణ గజల్స్ కు ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చారు. ఇందిర మరణ వార్త విని సాహిత్యవేత్తలు, గజల్ అభిమానాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె చివరి వీలునామాను కవిత్వం రూపంలో పొందుపరుచుకున్నారు. ‘నేను పోయినప్పుడు ఓ కాగితాన్ని కప్పండి.. రాసుకోడానికి పనికొస్తుంది. మట్టిలో కప్పెట్టకండి మరీ గాలాడదు.. పురుగూ పుట్రా ఉంటాయ్. పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్ బ్యాగులో ఉండేలా చూడండి.. సెల్ మర్చిపొయ్యేరు బోర్ కొట్టి చస్తాను. దండలు గిండలు వెయ్యకండి.. నాకు ఎలర్జీ. పసుపు గట్రా పూసి.. భయంకరంగా మార్చకండి. పిల్లలు జడుసుకుంటారు.. పైగా నన్ను గుర్తుపట్టాలి కదా. పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని పేర్లు పెట్టకండి.. నాకు చిర్రెత్తుకొస్తుంది. నా సామాన్లన్నీ పడేయకండి.. అడిగినవాళ్లకు ఇచ్చేయండి. కాస్త చూసి తగలబెట్టండి.. పక్కన మొక్కలుంటాయేమో. పనిలో పని కాష్టం దగ్గర కవిసమ్మేళనం పెట్టండి.. నేనూ ఉ(వి)న్నట్టుంటుంది’ అనే కవితను వీలునామాగా రాసుకున్నారు.