గుండెపోటుకు గురవ్వుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం ప్రముఖ నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన మరువక ముందే టీడీపీకి చెందిన ఓ కీలక నేత ఒకరు గుండె పోటుకు గురయ్యారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటు బారిన పడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
స్టెంట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. హై బీపీ కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బచ్చుల ఆరోగ్యంపై టీడీపీ అధినేత ఆరా తీశారు. ఫోన్ ద్వారా కుటుంబసభ్యులను ఎంక్వైరీ చేశారు. కాగా, కృష్ణా జిల్లాకు చెందిన బచ్చుల అర్జునుడు పలు కీలక పదవులు నిర్వహించారు. పార్టీలో కీలక నేతగా మంచి పేరు కూడా ఉంది. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరి, ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న గుండెపోటు కేసులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.