ఇంటర్నేషనల్ డెస్క్- ఈ విశ్వం ఎన్నో రహస్యాలను నిక్షిప్తం చేసుకుంది. మానవుడి మేధాశక్తితో విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ఈమేరకు ఒక్కో గ్రహంపైకి వెళ్తూ ఈ విశ్వంలో మనతో పాటు గ్రహాంతరవాసులు ఎవరైనా ఉన్నారా అన్నది తెలుసుకే ప్రయత్నం జరుగుతూనే ఉంది.
ఇదిగో ఇటువంటి సమయంలో సుదూర తీరంలోని పాలపుంతలో తిరుగుతున్న ఓ వింత వస్తువును ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి అరుదైన వస్తువును ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందెప్పుడు చూడలేదు. ఆస్ట్రేలియాకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ థీసిస్ చేస్తున్న ఓ యూనివర్సిటీ విద్యార్థి ముందు ఈ అరుదైన వస్తువును గుర్తించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ ఆరేలో టెలిస్కోప్ సాయంతో ఆ విద్యార్థి ఈ వస్తువును గుర్తించాడు.
పాలపుంతలో తిరుగుతున్న ఈ వింత వస్తువు గంటకు మూడుసార్లు భూమిపైకి సంకేతాలు పంపుతోంది. అంటే ప్రతీ 18.18 నిమిషాలకు ఒకసారి భూమికి రేడియో సిగ్నల్స్ పంపిస్తోంది. ప్రస్తుతం ఈ వస్తువుకు అల్ట్రాలాంగ్ పిరియడ్ మాగ్నెటార్ అని నామకరణం చేశారు. ఈ వస్తువు ప్రస్తుతం భూమికి దాదాపు నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీని అయస్కాంతక్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని, కాంతులు విరజిమ్ముతోందని దానిని విశ్లేషిస్తున్న హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త చెప్పారు. ఇది పాలపుంతలో ఎప్పటి నుంచే ఉండొచ్చని, కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్షం నుంచి వస్తున్న ఈ శక్తిమంతమైన, స్థిరమైన రేడియో సిగ్నల్‌ను గ్రహాంతరవాసులవిగా ముందు అనుమానించారు.
కానీ పరిశోధన బృందం విస్తృత శ్రేణి పౌనపుణ్యాలలో ఈ సిగ్నల్స్‌ను గుర్తించడాన్ని బట్టి అది సహజ ప్రక్రియ అయి ఉండాలని, ఇది కృత్రిమ సంకేతం ఎంతమాత్రమూ కాదని శాస్ట్రవేత్తలు పేర్కొన్నారు.