క్రైం డెస్క్- సామాన్యుల నుంచి పెద్ద వాళ్ల వరకు ఏ ఆపద వచ్చినా ఆశ్రయించేది పోలీసులనే. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతి భద్రతలను కాపాడుతుంటారు పోలీసులు. ఇక ఈ మధ్య కాలంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువవ్వడంతో పోలీసులే భరోసా కల్పిస్తున్నారు. మరి అటువంటి భాద్యాతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉండి, మరో మహిళా పోలీసును లైంగికవేధింపులకు గురిచేస్తే.. ఎవరితో చెప్పుకోవాలి.
అవును తమిళనాడులో ఓ పోలీసులు ఉన్నతాధికారి, తన క్రింది మహిళా పోలీస్ అధికారిపై వేధింపులకు పాల్పడడ్ ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిని స్పెషల్ డీజీపీ తన ఛాంబర్‌కు పిలిచారు. సీఎం భద్రతా చర్యల గురించి చర్చించాలని చెప్పి, తన కారులో ఎక్కించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
దీంతో షాక్ తిన్న సదరు మహిళా ఎస్పీ, స్పెషల్ డీజీపీపై తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి, డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సేలం నుంచి చెన్నైకి బయలుదేరింది. ఇంతలో స్పెషల్ డీజీపీ తన పలుకుబడిని ఉపయోగించి ఆమె చెన్నైకి వెళ్లకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. చెంగల్పట్టు జోన్ ఐజీ, మహిళా డీఐజీ, చెంగల్పట్టు ఎస్పీ సహా 50 మందికి పైగా పోలీసులు చెంగల్పట్టు చెక్ పోస్టు వద్ద మహిళా అధికారిని అడ్డగించి రాజీ కుదిర్చేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు.
కానీ ఆ మహిళా ఐపీఎస్ అధికారి ససేమిరా అనడంతో, చివరికి ఆమె నుంచి పోలీసులు కారు తాళాలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆమె వేరే వాహనంలో చెన్నైకి వెళ్లి సదరు స్పెషల్ డీజీపీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రెటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. చెంగల్పట్టు చెక్‌పోస్ట్ వద్దనున్న సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కలిసి అక్కడ నడిపిన రాజీ బాగోతం బయటపడింది.
దీంతో స్పెషల్ డీజీపీతో పాటు మిగిలిన ముగ్గురు పోలీస్ అధికారులపై కేసు నమోదుచేశారు. మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్పెషల్ డీజీపీపై తమిళనాడు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన తమిళనాడు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.