హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడి నియామకం ఇప్పుడు ఈ పార్టీలో కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో సీనియర్ నాయకులు కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది నేతలు అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అధిష్టానం డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని అమ్మకుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆయన ఎక్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పవచ్చని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం కాంగ్రెస్ పార్టీని విడుతారన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంపై ఇంతెత్తున లేసిన భట్టి విక్రమార్క స్వరంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత భట్టి వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని నేతలంటున్నారు. ఖమ్మం జిల్లాలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అంశంపై నిరసనలకు దిగిన మల్లు భట్టి విక్రమార్కకు ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆయనతో పాటుగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ మెట్లు ఎక్కారు. దీంతో భట్టి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కనీసం రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా ప్రగతి భవన్ ఎలా వెళ్తారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణికమ్ ఠాగుర్ భట్టిపై ఆగ్రహం వ్యక్తం చేశారని నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో మల్లు భట్టి విక్రమార్క డైలమాలో పడ్డారని తెలుస్తోంది. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన భట్టికి టీపీసీసీలో ఎక్కడా అవకాశం దక్కలేదు. దీంతో భట్టి మరింత ఆవేదనను గురైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మల్లు భట్టి విక్రమార్క టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.