సావిత్రి.. తెలుగు సినీ ప్రస్థానంలో ఆమెది ఓ చరిత్ర. కళ్లతోనే నటించగల అద్భుత ప్రతిభ ఆమె సొంతం. అమాయకమైన చూపు.. మూతి విరుపుతో చేసే మాయ.. కల్మషం లేని చిరునవ్వు.. సావిత్రికి పెట్టని ఆభరణాలు అని చెప్పవచ్చు. 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఆమెకు సాటి రాగాల నటి రాలేదంటే.. సావిత్రి ప్రతిభ, సోయగం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. తెర మీద ఎన్నో భావాలను అవలీలగా పలికించే సావిత్రికి.. నిజ జీవితంలో కనీసం ఎవరు ఎలాంటి వారో అంచనా వేయలేకపోయారు. అందరూ మంచివాళ్లే అనుకుని నమ్మి.. దారుణంగా మోసపోయారు.
స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో సమానంగా పారితోషికం అందుకున్న ఘనత సావిత్రి సొంతం. సినిమాల్లో హీరోయిన్‌గా కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన సావిత్రి.. నమ్మిన వారి చేతిలో దారుణంగా మోసపోయి అన్ని పొగొట్టుకుంది. ఇక సావిత్రి జీవితం గురించి ఎంత తెలుసుకున్నా.. ఇంకా ఏదో మిగిలే ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది.
ఈ క్రమంలో సావిత్ర జీవితం ఆధారంగా తెలుగులో మహానటి సినిమా వచ్చింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్.. జీవించింది అనే చెప్పవచ్చు. సావిత్రి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ క్రమంలో తాజాగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సుమన్ టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మహానటి సినిమా తర్వాత తమ ఇంట్లో చాలా గొడవలు అయ్యాయని.. అక్కలు తనను తిట్టారని.. మూడేళ్ల పాటు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు సావిత్రి కుమార్తె. ఆ వివరాలు.
‘‘మహానటి చిత్రం తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి. నాన్న వల్లే అమ్మ జీవితం ఇలా అయ్యిందని అందరూ ఆయనని తిడుతూ కామెంట్స్ చేశారు. అవి చూసి అక్కవాళ్లు(జెమిని గణేషన్ మొదటి భార్య కుమార్తెలు) నీ వల్లే నాన్న పేరు చెడిపోయింది అని నన్ను తిట్టారు. నాతో మాట్లాడటం కూడా మానేశారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుంది. మూడేళ్ల తర్వాత తాజాగా.. అందరం ఓ ఫంక్షన్‌లో కలిశాం. అప్పుడు అక్కలు నన్ను దగ్గరకు తీసుకుని.. హగ్ చేసుకుని ఎలా ఉన్నావు అని ప్రశ్నించారు. ప్రస్తుతం అందరం కలిసిపోయాం. ఇక ఈ గొడవలపై రేఖ అక్క కూడా నాకు కాల్ చేసింది’’ అని చెప్పుకొచ్చారు.
‘‘రేఖ అక్క మాట్లాడుతూ.. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లు ఎవరూ చూపించారు. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం కోసం కొంచెం మసాలా యాడ్ చేస్తారు. నువ్వు ఈ గొడవలేం పట్టించుకోకు. కొన్ని రోజులు పోతే వాళ్లకే అర్థం అవుతుంది’’ అని నన్ను ఓదార్చింది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. సావిత్రి.. జెమిని గణేషన్‌కు రెండో భార్య. సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ముందే.. జెమిని గణేషన్‌కు అప్పటికే ఆలమేలుతో వివాహం కావడమే కాక.. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత.. జెమిని గణేషన్ మొదటి భార్య, పిల్లలతో సావిత్రికి మంచి సంబంధాలే ఉండేవి. అందరూ కలిసిమెలసి ఉండేవారు.