చెన్నై సుందరి రెజీనా ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. ‘ఎవరు’ హిట్ తర్వాత తెలుగులో సినిమాలలో కనిపించని రెజీనా ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. చిరంజీవి ‘ఆచార్య’లో ఓ పాటలో కనిపించనున్న రెజీనా తమిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి విడుదలకు రెడీగా ఉంది. ‘పార్టీ, కల్లాపార్ట్, కసాదా తప్పర, శూర్పణగై’ పేర్లలో అవి తెరకెక్కుతున్నాయి. ఇక తెలుగులోనూ ‘నేనా నా’, ‘మిడ్ నైట్ మర్డర్స్’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఓ క్రేజీ ఆఫర్ రెజీనా తలుపు తట్టిందట. రాయ్ కపూర్ ఫిల్మ్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ రూపొందించే వెబ్ సీరీస్ ‘రాకెట్ బోయ్స్’లో కీలక పాత్రకు రెజీనాను ఎంపిక చేశారట. ఇదో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా వంటి మేథావుల నిజజీవిత కథలతో ‘రాకెట్ బోయ్స్’ని తెరకెక్కిస్తున్నారు.
ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో రెజీనా భాగమవ్వడం లక్కీ అనే చెప్పాలి. ‘ఏక్ లడకీ కో తో అసీ లగా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అది రెజీనాకు కలిసి రాలేదు. ఇప్పుడు ఈ హిందీ వెబ్ సిరిస్ తోనైనా బాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి. ఇందులో ఇశ్వాక్ సింగ్, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. స్పెస్ సైన్స్ ఆధారంగా రూపొందుతున్న సిరీస్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సిరీస్ సక్సెస్ అయితే.. రెజీనా కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోతుందని సన్నిహితులు అంటున్నారు