మెగా డాటర్ నిహారిక మళ్లీ నటన మీద ఫోకస్ పెడుతున్నారు. భారీ గ్యాప్ తర్వాత ఆమె ప్రేక్షకులను పలకరించనున్నారు. నిహారిక నటించిన ఒక వెబ్ సిరీస్ త్వరలో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొణిదెల నిహారిక.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నటిగా ఆడియెన్స్ మనసుల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. మెగా డాటర్ అనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మంచి యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో సొంత గుర్తింపును దక్కించుకున్నారు. అందం, అభినయంతో యూత్ ఆడియెన్స్‌లో పాపులారిటీ సంపాదించారు. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నిహారిక.. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెడుతున్నారు. నాలుగేళ్ల విరామం అనంతరం ఆమె నటిగా మరోమారు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నిహారిక ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. ఈ సిరీస్ మే 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘డెడ్ పిక్సెల్స్’ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి నిహారిక స్పందించారు. పని పాట లేనివాళ్లే ట్రోల్స్ చేస్తారన్నారామె.
‘పని పాట లేనివాళ్లే ట్రోల్స్ చేస్తారు. అలాంటి వారి గురించి నేను పట్టించుకోను. మనం అవసరం లేనివారికి అటెన్షన్ ఇస్తుంటాం. ప్రతిచోట ఇడియట్స్ ఉంటారు. వాళ్లను పట్టించుకుంటే ‘నా వెధవతనం వల్ల ఇంత అటెన్షన్ ఇస్తున్నారు’ అనుకొని ఇంకా రెచ్చిపోతారు. నా వరకైతే.. అలాంటి వారిని అస్సలు పట్టించుకోను. నన్ను అభిమానించే వాళ్లు, ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాగే నాకు ఇష్టమైన వాళ్లు కూడా ఉన్నారు. కాస్త ఖాళీ టైమ్ దొరికినా వాళ్లకు కేటాయిస్తా. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు పట్టించుకుంటా? సోషల్ మీడియాలో నా మీద వచ్చే కామెంట్స్‌ను ఒకప్పుడు చూసేదాన్ని. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ఎవడో ఏదో కామెంట్ చేస్తే నేనెందుకు చూడాలి. దాని వల్ల మన హెల్త్ పాడవుతుంది. అందుకే సోషల్ మీడియా రూమర్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను’ అని నిహారిక వ్యాఖ్యానించారు.