ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్యే, హీరో ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంర్బంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నాకంటే తానే సీనియర్ అని తారక్ ఎప్పుడూ గొడవ పడుతుంటాడని, తారక్ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని రాజమౌళి అన్నారు.
షూటింగ్ కు ఉదయం 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు కాబట్టి నీకు టైమ్ సెన్స్ లేదని తారక్‌ని ఎప్పుడూ తిడుతుంటానంటూ సరదాగా కామెంట్ చేశారు రాజమౌళి. తారక్ ది లయన్ పర్సనాలిటీ, చైల్డ్ మెంటాలిటీ అని చెప్పిన రాజమౌళి, ఇలాంటి నటుడు దొరకడం భారతీయ చలన చిత్ర పరిశ్రమ అదృష్టమంటూ పొగడ్తలలో ముంచెత్తారు.
మెగా హీరో రామ్ చరణ్ గురించి చెబుతూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్లియర్ మైండ్ తో సెట్‌కు వచ్చే వ్యక్తి అని అన్నారు రాజమౌళి. రామ్ చరణ్ ను మై హీరో అంటుంటానని చెప్పారు. మీకేం కావాలి, దాన్ని నేను ఎలా చేయగలను అని ఆలోచించే మెంటాలిటీ చెర్రీదని, ఇలాంటి మెంటాలిటీని నేను ఎవరిలోనూ చూడలేదని రాజమౌళి అన్నారు. చరణ్, తారక్, ఈ ఇద్దరిలో దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరని చెప్పారు. వీళ్లిద్దరు ఆర్ఆర్ఆర్ అనే అయస్కాంతానికి అతుక్కునందుకు తనకెంతో సంతోషంగా ఉందని రాజమౌళి వ్యాఖ్యానించారు.