బెంగళూరు- పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం గుండె పోటుతో కన్నుమూశారు పునీత్ రాజ్ కుమార్. ఇంట్లో ఉదయం జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పారు.
శాండల్ వుడ్ లో చిన్న వయసులోనే సూపర్ స్టార్ ఇమేజ్‌ను సాధించిన పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని కన్నడ నాడు శోక సంద్రంలో మునిగిపోయింది. పునీత్ రాజ్ కుమార్ మృతి నేపథ్యంలో కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున బెంగళూరు చేరుకుంటున్నారు. తమ అభిమాన నటుడిని చివరి చూపు చూసేందుకు ఫ్యాన్స్ తండోపతండాలుగా వస్తున్నారు.
దీంతో అధికారులు బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం శనివారం ఉదయం బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. ఆ తరువాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకోసం కర్నాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటోంది కర్నాటక సర్కార్.
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించాలని నిర్ణయించారు. అంతే కాదు పునీత్ రాజ్ కుమార్ తల్లి పర్వతమ్మ రాజ్ కుమార్ సమాధి కూడా అక్కడే ఉంది. దీంతో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను కూడా తల్లి తండ్రుల సమాధుల పక్కనే చేయాలని కుటంబ సభ్యులు నిర్ణయించారు. ఈమేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.