10 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మార్చి 16 నుంచి 26 వరకూ అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులు స్కూళ్లకు సెలవులు ఇవ్వడానికి కారణం ఏంటంటే?
అప్పట్లో కరోనా మహమ్మారి ఎంత కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా ఛాయలు పోయి బయటపడుతున్నామనగా మరో వైరస్ గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇన్ఫ్లూయెంజా ఏ రకం వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ హెచ్3ఎన్2 వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కి సంబంధించిన కేసులు బయటపడుతున్నాయి. చిన్నారులకు, వయోవృద్ధులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఈ వైరస్ కారణంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉన్న కారణంగా సెలవులు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి 26 వరకూ పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫ్లూయెంజా ఏ వైరస్ వల్ల పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంలో పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం ప్రాంతాల్లో అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యా శాఖ మంత్రి ఏ నమశ్శివాయం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు హెచ్3ఎన్2తో పాటు కోవిడ్-19, స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా తమిళనాడులోని 545, మహారాష్ట్రలో 352, గుజరాత్ లో 180, కేరళలో 50, పంజాబ్ లో 30 కేసులు నమోదయ్యాయి. జనవరి నెలలో దేశంలో 3.97 లక్షల శ్వాసకోశ అనారోగ్య కేసులు, ఇన్ఫ్లూయెంజా వంటి అనారోగ్య కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో ఈ కేసుల సంఖ్య 4.36 లక్షలు కాగా.. మార్చి నెలలో మొదటి 9 రోజుల్లో 1.33 లక్షల కేసులు నమోదయ్యాయని ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫారమ్ డేటా వెల్లడించింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా ఏ ఉపరకం వైరస్ వ్యాప్తి ఎక్కువవ్వడం.. పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉండడంతో పుదుచ్చేరి ప్రభుత్వం పది రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.