జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల కోసం పగడ్బంధీగా సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేయటానికి వారాహి అనే వాహనాన్ని రంగంలోకి దింపారు. వారాహి వాహనంపైనే పవన్ కల్యాణ్ ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఇక, వారాహి వాహనానికి మంగళవారం కొండగట్టులో ప్రత్యేక పూజలు జరిగిన సంగతి తెలిసిందే. కొండగట్టులో పూజల అనంతరం వారాహి వాహనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించటానికి పవన్ కల్యాణ్ విజయవాడ దుర్గ గుడికి కూడా వచ్చారు. బుధవారం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం తన ప్రచార వాహనమైన వారాహికి కూడా పూజలు చేయించారు. అయితే, దుర్గమ్మ వారు కొలువైన కొండపైకి వారాహికి అనుమతి లభించలేదు. దీంతో ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం ఎదుట పూజలు నిర్వహించారు. పవన్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేయబడింది. కొండ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పవన్‌తో పాటు గుడిలోపలికి వెళ్లటానికి ఆయన వ్యక్తిగత సిబ్బందిని అధికారులు అనుమతించలేదు. కేవలం అతికొద్ది మంది కీలక నేతలను మాత్రమే లోపలికి పంపించారు. ఇక, పవన్ కల్యాణ్ గుడి దగ్గరకు వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు, జనసేన కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పూజ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. రాక్షస పాలన అంతం చేయటమే వారాహి లక్ష్యమని పేర్కొన్నారు. అమ్మవారి సన్నిధిలో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. కాగా, ఈ మధ్యాహ్నం ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో జనసేన నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. మరి, విజయవాడలో పవన్ కల్యాణ్ ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.