మహబూబాబాద్- కరోనా నేపధ్యంలో మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా చదువుకునే విధ్యార్ధులు ఇళ్లలోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులతు అటెండ్ అవుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఆఖరికి ఆన్ లైన్ క్లాసులు వినే విధ్యార్ధులను సైతం వదలడం లేదు. తమదైన స్టైల్లో వల వేసి వారి నుంచి డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఇదిగో ఇక్కడ ఆన్ లైన్ క్లాసుల కోసం కొడుక్కి ఫోన్ కొనివ్వడమే ఆ తండ్రి చేసిన నేరం అయ్యింది. ఆన్ లైన్ క్లాసుల్లో పాఠాలు వినడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆ కొడుకు చేసిన పనికి లక్షా 50 వేల రూపాయలను కోల్పోవలసి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ పేద రైతు కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
మహబూబాబాద్ జిల్లా భూక్యారామ్ తండాకు చెందిన వెంకన్నకు స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఈ నెల ధాన్యం అమ్మగా వచ్చిన నగదు, రైతుబంధు కింద వచ్చిన డబ్బులు, తాను దాచుకున్న సొమ్ము మొత్తం కలిసి 1లక్ష 50 వేల రూపాయల వరకు ఆ ఖాతాలో జమ చేశాడు. తీరా విత్తనాలు కొనేందుకు డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లిన వెంకన్నకు షాక్ తగిలింది. తన అకౌంట్ లో కేవలం 613 రూపాయలు మాత్రమే ఉన్నాయని బ్యాంకు సిబ్బంది చెప్పారు. షాక్ తిన్న వెంకన్న బ్యాంక్ స్టేట్ మెంట్ తీసుకుని చెక్ చేశాడు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో ఒకేసారి 1లక్ష 50వేల రూపాయలు తన బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయినట్లు స్టేట్ మెంట్ లో ఉంది.
అసలేలా జరిగిందని ఆరా తీస్తే.. వెంకన్న కొడుకు గణేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తనకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్‌ను కొనిచ్చాడు. తన బ్యాంకు అకౌంట్ ను కూడా ఆ పోన్ లో ఉన్న యాప్స్‌కు లింక్ చేశారు. ఈ క్రమంలో గణేష్‌కు ఫోన్‌లో ఒక లింక్ వచ్చింది. కేవలం 100 రూపాయలు పంపితే 200 రూపాయలు గెలవచ్చంటూ అందులో ఉంది. ఇంకేముంది గణేష్ ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే వెంకన్న బ్యాంకు అకౌంట్ నుంచి ఏకంగా 1లక్ష 50 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అదన్న మాట సంగతి. వ్యవసాయం కోసం దాచుకున్న డబ్బులు ఇలా పోవడంతో వెంకన్న కుటుంబం ఆవేధన వ్యక్తం చేస్తోంది. ఇక చేసేది లేక వెంకన్న వెంటనే బ్యాంకు ఖాతాను నిలిపివేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకే ఫోన్ కు వచ్చే గుర్తు తెలియని లింక్ లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.