సాధించాలనే పట్టుదల దానికి తగిన కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపిస్తున్నారు పేదింటి బిడ్డలు. అకుంఠిత దీక్షతో రాత్రి పగలు చదివి కన్నోల్ల కలల్ని వారి కష్టాన్ని వమ్ము చేయకుండా వారి ఆశయాలను సాధిస్తున్నారు.
సాధించాలనే పట్టుదల దానికి తగిన కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపిస్తున్నారు పేదింటి బిడ్డలు. అకుంఠిత దీక్షతో రాత్రి పగలు చదివి కన్నోల్ల కలల్ని వారి కష్టాన్ని వమ్ము చేయకుండా వారి ఆశయాలను సాధిస్తున్నారు. తాము పెట్టుకున్న లక్ష్యాలకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. ఉన్నత ఉద్యోగాలను సాధించి పేదరికం చిన్నబోయేలా చేస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగ నియామకాల్లో పలువురు పేదింటి అభ్యర్థులు ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ హమాలీ కుమార్తె సివిల్ ఎస్సై ఉద్యోగానికి ఎంపికైంది. ఎస్సై ఉద్యోగం సాధించిన ఆ యువతిపై సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతేడాది 587 ఎస్ఐ, ఏఏస్ఐ పోస్టులకు ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించగా వీటికి సంబంధించిన ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో మరో మట్టిలో మాణిక్యం విజేతగా నిలిచింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన హేమలత సివిల్ ఎస్సైగా ఎంపికై పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు గర్వకారణమైంది. కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కలలను నిజం చేసింది. పేరెంట్స్ కష్టాలను చూస్తూ పెరిగిన హేమలత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదివి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
సివిల్ ఎస్సైగా ఎంపికైన బొల్లాబోయిన హేమలత తల్లిదండ్రులు బొల్లాబోయిన కుమారస్వామి-పద్మ. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం వీరిది. హేమలత తండ్రి కుమారస్వామి హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా హేమలత గవర్నమెంట్ స్కూల్ లో పదోతరగతి పూర్తి చేసి ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసిన హేమలత గ్రూప్-1 పరీక్షకు సిద్ధమవుతోంది. హేమలత తల్లితండ్రుల కష్టాల్లో పాలుపంచుకుంటూ చెల్లికి పెళ్లి చేశారు. తాను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించేవరకు పెళ్లి చేసుకోవద్దనుకుని నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అలుపెరగని కృషితో తొలి ప్రయత్నంలోనే ఎస్సైగా ఎంపికైంది. పేదింటి బిడ్డ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.