భర్తని చంపేసిన భార్య. భర్తని మోసం చేసిన భార్య.. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువయ్యాయి. కానీ.., భారతీయ వైవాహిక వ్యవస్థ ఈరోజుకి ఇంత బలంగా ఉందంటే.. దానికి కారణం మాత్రం స్త్రీ జాతి అని కచ్చితంగా చెప్పుకోవాలి. అలాంటి ఓ మహా ఇల్లాలి కథ ఇది. వేద మంత్రాల సాక్షిగా మెడలో మూడు ముళ్ళు వేసిన భర్తనే దైవంగా భావిస్తూ.., భర్తకి గుడి కట్టి పూజిస్తున్న ఓ పుణ్య స్త్రీ కథ ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. ఒకరంటే మరొకరికి ప్రాణం. అంకిరెడ్డి బతికున్నంత కాలం తన భార్యకి ఏ లోటు రాకుండా ప్రేమగా చూసుకున్నాడు. కానీ.., వీరి అన్యోన్యత చూసి ఆ దేవుడికి సైతం కన్ను కుట్టింది ఏమో? నాలుగేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో అంకిరెడ్డి కన్ను మూశాడు. కొడుకులు, కోడళ్ళు, బంధువులు ఎంత మంది, ఎన్ని రకాలుగా ఓదార్చినా పద్మావతి ఆ బాధ నుండి బయటకి రాలేకపోయింది. తన భర్త అంకిరెడ్డిని అలానే స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాల్లో ఉండిపోయింది. ఇక చివరికి తన భర్త కోసం ఓ గొప్ప ఆలోచన చేసింది పద్మావతి.
తన భర్త మాదిరి పాలరాతి విగ్రహం ప్రతిష్టించింది ఆ భార్య. ఆ ప్రదేశాన్ని ఓ ఆలయంగా మార్చేసింది. భర్త విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ..,ఆమె ఓ భక్తురాలిగా మారిపోయింది. ఇంతేనా..? భర్త పేరు మీద సమాజ సేవను కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి, ప్రతి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మొత్తం కార్యక్రమానికి కుమారుడు శివశంకర్ రెడ్డి, భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి పద్మావతికి సహకరిస్తున్నారు. బతికున్నంత కాలం భర్తలను వేధించుకు తింటున్న భార్యలు ఉన్న ఈరోజుల్లో కూడా.., చనిపోయిన భర్తకి విగ్రహం కట్టి దేవునిగా సేవిస్తున్న పద్మావతి లాంటి భార్య ఎందరికో ఆదర్శం. మరి.. చూశారు కదా? పద్మావతి పతి భక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.