కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ కొత్త సంవత్సరం. తాగడానికి, తాగి తూలడానికి, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకోవడానికి, అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి, ఈసారైనా సాధించాలని గోల్ పెట్టుకోవడానికి, గోల చేయడానికి.. ఇదే లాస్ట్ టైం.. ఇక నుంచి తాగకూడదు అని ఒక యాంబిషన్ పెట్టుకోవడానికి.. అన్నిటికీ ఒకటే సాకు.. అదిగో జనవరి ఒకటో తారీఖు. దాని ముందు రోజు వచ్చే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి చేసే రచ్చ ఉంటుంది చూడండి.. ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ లో ఉంటారు. ఇక మందుబాబుల గురించి ఐతే మాటల్లో చెప్పలేము. మిగతా రోజుల్లో సంగతేమో గానీ డిసెంబర్ 31 రాత్రి నాడు మందుబాబుల కడుపులో మద్యం ఏరులై ప్రవహిస్తుంది. ఆరోజు ఒక్క రాత్రే ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అంతలా మద్యం వినియోగం ఉంటుంది.
అయితే కొత్త సంవత్సరం సాకుతో అతిగా మద్యం తాగితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా ఒక గ్లాస్ మద్యం తాగితే.. ఎక్కడ లేని ఉత్సాహం, శక్తి వచ్చేస్తాయి. మెదడు ఉత్తేజితమవుతుంది. శరీరంలో ఎండార్ఫిన్, డోపమైన్ వంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అయితే గ్లాస్ కంటే ఎక్కువ మద్యం పుచ్చుకుంటే.. జీవితం పుచ్చుపోతుందని.. పుచుక్కుమని పుటుక్కుమంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ అయినా, మందైనా, ఏదైనా అతిగా తీసుకుంటే హానికరమని అంటున్నారు. అమితంగా మద్యం తాగడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. అతి మద్యం కడుపులో పడగానే మొదటి ప్రభావం చూపించేది మెదడు పైనే.
అతిగా తాగడం వల్ల మెదడు పని చేసే విధానం మందకొడిగా తయారవుతుంది. శ్వాస ఆడడం కూడా నెమ్మదిగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతి మద్యం సేవించడం వల్ల అది రక్తంలో చేరి శరీర అవయవాల మధ్య సమన్వయం లోపిస్తుంది. అందుకే చాలా మంది తూలుతుంటారు. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. అతిగా మాట్లాడతారు. మెదడుతో పాటు కాలేయాన్ని సైతం మద్యం ప్రభావితం చేస్తుంది. మద్యం కణాలను విరిచేందుకు కాలేయానికి అదనపు పని కలుగుతుంది. కడుపులో ఆల్కహాల్ పడగానే అది మొదట ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. దీని వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. హెపటైటిస్, లివర్ క్యాన్సర్, గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే అతిగా మద్యం సేవించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. దీని అర్థం వారి శరీరం మద్యాన్ని సపోర్ట్ చేయలేకపోతోందని. అతిగా మద్యం తాగితే మెదడు సరిగా పనిచేయదు. కాలేయ సమస్యలు వస్తాయి. శరీరంలో అవయవాల సమన్వయం లోపిస్తుంది. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం క్వాంటిటీ తగ్గిస్తారా? మనకెందుకండీ ఈ రోగాలు అని తాగడం మానేస్తారా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. అలానే ఈ విషయాన్ని మీ బ్యాచ్ లో ఉండే మందు బాబులకు చెప్పండి.