సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ మీరట్ లో ఓ యువతి తనకు తానే ఆత్మార్పణం గావించుకుంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. మీరట్ జిల్లా ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్దలతో పూజించేది. ప్రతిరోజు ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించేది. యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాను మహా భద్రకాళి కూతురునని భావించడం మొదలుపెట్టింది. తెల్లవారుజామున పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది.
అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. రోజు మాదిరిగా సాయంత్రం వచ్చిన పూజారికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి పూజారి షాక్‌కు గురైయ్యాడు.
గ్రామస్తులకు, పోలీసులకు పూజారి సమాచారం అందించాడు. ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.