ఓ జంట మనసానా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లైన ఎనిమిదేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వెంజరమూడు లో ఇటీవల ఓ జంటకు సంబంధించిన వెడ్డింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ జంట పెళ్లయిన ఏనిమిది సంవత్సరాల తర్వాత తన భార్యకి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. వారి కుమార్తె సాక్షిగా అనీష్, డాక్టర్ వైయస్ రజిగ మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంజరమూడులో నివాసం ఉంటున్న అనీష్, రజిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు రజిత పీజీ చేస్తుండగా అనీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఒక స్నేహితుడి పెళ్లిలో ఇద్దరు కలిశారు.. ఆ తర్వాత స్నేహితులుగా మారి ప్రేమించుకున్నారు. కొంత కాలం తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనీష్ బంధువులు రజిత తల్లిదండ్రులను కలిశారు. అయితే వాళ్లు మాత్రం ఈ పెళ్లి చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఇక రక రకాలుగా పెళ్లి కొడుకు తరపు వాళ్లు నచ్చజెప్పడంతో రజితను కట్టుబట్టలతో ఇంటికి తీసుకువెళ్లాలని అనీష్ బంధువులను కోరారు. వారి కోరిక ప్రకారం కట్టుబట్టలతో రజితను అనీష్ కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లారు.
ఈ జంటకు పెళ్లయిన తర్వాత కొంత కాలం సంతోషంగా ఉన్నారు. అయితే కొంత కాలంగా రజితలో ఏదో తెలియని నిరుత్సాహం.. ఆవేదనను గమనించాడు అనీష్. ఆమె ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే ఆ రోజు అంతా బాధలో ఉంటున్నట్లు గమనించాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలు మీరా అజిత్ కుమార్ తో పంచుకున్నారు. అనీష్ భార్య పడుతున్న బాధను అర్థం చేసుకున్న మీరా చక్కటి ఐడియా ఇచ్చింది. వారికి వెడ్డింగ్ షూట్ చేసి ఆమెను సంతోష పర్చవొచ్చని తెలిపింది.
అందుకోసం మీరా అన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అనీష్, రజిత వధూవరులుగా తయారయ్యారు. ఆ సమయంలో రజిత ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది. కొన్ని అద్భుతమైన ప్రదేశాల్లో వెడ్డింగ్ షూట్ జరిగింది. ఆ వెడ్డింగ్ షూట్ లో తీసిన ఫోటోలు డిజిటల్ ఆల్బమ్ గా మారాయి. వెడ్డింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.