ఈ కాలంలో ఏ పెళ్లి జరిగినా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ముఖ్యం అయిపోయింది. ప్రతీ ఒక్కరు ప్రీ వెడ్ షూటింగ్ కోసం పరితపిస్తున్నారు. జిహ్మకో రుచి పుర్రెకు ఓ బుద్ధి అన్నట్లుగా కొత్త కొత్త పద్దతుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే.. బంధు, మిత్రుల సంబరాలు.. అలకలు, అల్లర్లు ఇలా పెళ్లి జరిగినన్ని రోజులు ఎంతో సందడిగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా జనం కూడా మారిపోయారు. పెళ్లంటే ప్రీవెడ్ షూటింగ్.. ప్రీ వెడ్ షూటింగ్ అంటే పెళ్లి అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పెళ్లి తర్వాత భార్యాభర్తలు కలిసి పోస్ట్ పెడ్డింగ్ ఫొటోలు తీసుకునేవారు. వాటిని ఎంతో అందమైన జ్ఞాపకాలుగా పెట్టుకునేవారు. కానీ, ఈ రోజుల్లో ప్రీ వెడ్ షూటింగ్ పెళ్లిలో కీలక భాగం అయిపోయింది. ప్రీ వెడ్ షూటింగ్ ఫొటోలు, వీడియోల కోసం జంటలు నానా తంటాలు పడుతున్నాయి.
ఒక జంటను మించి ఒక జంట కొత్త దనం కోసం తహతహలాడుతున్నాయి. తాజాగా, ఓ జంట ప్రీ వెడ్ షూటింగ్ కోసం ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టింది. రైల్వే ట్రాక్ మీద ప్రీ వెడ్ షూటింగ్ జరిపింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి జంటకు బుద్ధి చెప్పారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువతీ,యువకుడికి కొద్దినెలల క్రితం పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం, పెళ్లి పత్రికలు ముద్రించటం అంతా చకచకా జరిగిపోయింది. పెళ్లికి ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్ షూటింగ్ నిర్వహించాలని ఆ జంట భావించింది. అందరికంటే భిన్నంగా తమ ప్రీ వెడ్ షూటింగ్ ఉండాలని అనుకుంది.
ఇందుకోసం రైల్వే ట్రాక్ మీద ప్రీ వెడ్ షూటింగ్ నిర్వహిస్తే అదిరిపోతుందని ఓ నిర్ణయానికి వచ్చింది. అనుకున్నదే తడవుగా కెమెరామ్యాన్‌తో పాటు మరికొంతమందితో గ్వాలియర్‌లోని రైల్వే ట్రాకు మీదకు వెళ్లారు. రైలు పట్టాల మీద వివిధ ఫోజుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. అటుగా వెళుతున్న రైల్వే పోలీసులు వారిని చూశారు. చివాట్లు పెట్టి అక్కడినుంచి పంపించేశారు. ఇలా చేస్తే జైలు పాలుకావాల్సి వస్తుందని హెచ్చరించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.