సమాజాన్ని రక్షించడంలో పోలీసులదే ప్రధాన పాత్ర. సంఘ విద్రోహక శక్తుల నుంచి ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. అందుకే సమాజంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. విధి నిర్వహణలో ఎంతో కఠినంగా వ్యవహరించే వీళ్లు.. తమలోని మంచి మనస్సును అనేక సందర్భాల్లో చాటుకుంటారు. నడి రోడ్డుపై ప్రాణాలు పోయే స్థితిలో ఉండే చాలామందిని పోలీసులు కాపాడారు. అలానే కొందరు పోలీసులు అనాథలకు ఆర్ధిక సాయం చేస్తుంటారు. అలానే పెళ్లి పెద్దలుగా వివాహాలు జరిపిస్తుంటారు. తాజాగా జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మాజీ మహిళ మావోయిస్టులకు పోలీసులే పెళ్లి జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాలోని కొంధమాల్ జిల్లా గుడ్రి గ్రామానికి చెందిన సప్నితా అలియాస్ నందిని, ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని గుముడి గ్రామానికి చెందిన పూలబతి అలియాస్ కరుణ గతంలో మావోయిస్టులుగా పనిచేశారు. 2019లో నందిని ఎస్పీ ఎదుట లొంగిపోయి..జనజీవన స్రవంతిలో కలిసింది. అలానే ఇటీవల కరుణ కూడా డీజీపీ ఎదుట లొంగిపోయింది. దీంతో వారిద్దరికి కుట్లు,అల్లికల్లో పోలీసులు శిక్షణ ఇప్పించారు. అనంతరం వారిద్దిరికి ఓ ఉపాధి కూడా కల్పించారు. అంతేకాక పోలీసులు ఒక అడుగు ముందుకేసి వారిద్దరికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు.
ఈక్రమంలోనే ఆ మహిళలిద్దరి కోసం పోలీసులు స్వయంగా పెళ్లి సంబంధాలు చూశారు. నందినికి దారింగిబాడికు చెందిన బినోద్ తో, కరుణకు జి.ఉదయగిరి ప్రాంతానికి చెందిన స్వప్నేశ్వర్ తో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈక్రమంలో ఆదివారం కొంధమాల్ జిల్లా పుల్బాణీ పట్టణంలో రిజర్వు పోలీసు లైనులోని రాధాకృష్ణ మందిరంలో పోలీసుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆ ఇద్దరి మహిళా ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి ఇరుకుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. మాజీ మహిళ మావోయిస్టులకు పెళ్లి జరిపించడంతో పోలీసులపై స్థానికులు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. గతంలో పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు అనేక నిర్వహించారు.