మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కాగా ఇవాళ పోలీస్ శాఖపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షనలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు అభిప్రాయపడింది.
ఇటీవల మణిపూర్ లో కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను మైతీ తెగకు చెందిన అల్లరిమూక బలవంతంగా బట్టలు విప్పించి ఊరేగించిన వీడియో బయటపడడంతో ఆ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె తండ్రి, సోదరుడిని హతమార్చి కౄరంగా వ్యవహరించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ లో స్థానిక తెగల మధ్య చోటుచేసుకున్న ఘర్షనలు హింసాకాండకు తెరలేపాయి. రాష్ట్రం అంగ్నిగుండంలా మారి ఘర్షనలు చెలరేగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఏమాత్రం చలనం లేకుండా అల్లర్లను నిలువరించలేకపోయింది. దీనిపై సుమోటోగా కేసును స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్ లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం ఘటనలను అడ్డుకోవడంలో విఫలమైంది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్షలు వెల్లువెత్తాయి. కాగా మణిపూర్ అల్లర్లపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మణిపూర్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల నుంచి అరాచకాలు జరుగుతుంటే కేసుల నమోదు, విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. మణిపూర్ లో శాంతి భద్రతల ఊసేలేదని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందంటూ ఆగ్రహించింది. ఆరు వేలకు పైగా ఎఫ్ఐఆర్ లు నమోదైతే, అరెస్టులు చేయలేదని, విచారణ జరుపలేదని పోలీస్ శాఖ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుందని ధర్మాసనం మండిపడింది. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ మణిపూర్ డీజీపీకి సమన్లు జారీ చేసింది.
మణిపూర్ లో 6000కు పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, వీటిలో 11 మహిళలపై జరిగిన వేధింపులకు సంబంధించిన కేసులు ఉన్నాయని సుప్రీం తెలపింది. ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మణిపూర్ డీజీపీ సమగ్ర నివేధికతో శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటలకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. ఇక మణిపూర్ అల్లర్లపై పూర్తిగా విశ్లేషణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని మణిపూర్ సొలిసిటర్ జనరల్ ను సుప్రీం కోర్టు కోరింది.