మణిపూర్ ఘటనలో పోలీసులే అమ్మాయిలను నిందితులకు అప్పగించారని బాధితులు చెబుతున్నారు. దీంతో పోలీసుల మెడకు ఈ పాపం చుట్టుకోనుందా?
ఒక ఊరు. అప్పటి వరకూ తమతో కలిసి జీవించిన వారు ఉన్నట్టుండి శత్రువులైపోయారు. మీద పడి దాడులు చేశారు. అమ్మాయిలను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లను, పొలాలను తగలబెట్టారు. బూడిద తప్ప ఇంకేం మిగల్లేదు. తిరిగి వెళ్లాలన్నా ఏం ఉందని.. ఎవరున్నారని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇది మణిపూర్ నేపథ్యం. మణిపూర్ ఘటన.. దేశాన్ని కుదిపేసిన ఒక కీచక పర్వం. రెండున్నర నెలలుగా హింస, అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతోంది. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు అమ్మాయిలను అపహరించి, వారిని వివస్త్రలను చేసి.. నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎలా అయితేనే ఈ నీచానికి ఒడిగట్టిన నలుగురు నిందితులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. అయితే ఈ ఘటనకు పోలీసులే కారణం అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులే చూస్తూ చూస్తూ తమ ఆడబిడ్డలను నీచుల గుంపుకి వదిలేశారని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లి జాతీయ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో హింసను ఆపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను, కొడుకును చంపేశారని అన్నారు. తన కూతుర్ని అత్యాచారం చేయబోతుంటే ఆపేందుకు ప్రయత్నించిన తన కొడుకును చంపేశారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసులు ఇద్దరు మహిళలను గుంపుకి వదిలేశారని.. దీంతో వారిని నగ్నంగా ఊరేగించారని ఆమె అన్నారు. కొంతమంది గుంపు తమ ఇంటి మీదకు వచ్చి దారుణానికి ఒడిగట్టారని అన్నారు. తమ వాళ్ళను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. ఎవరి కోసం బతకాలని ఒక బాధితురాలి తల్లి వాపోతున్నారు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి బతకడానికి ఏమీ మిగల్చలేదని.. పొలాలు, ఇళ్ళు అన్నీ నాశనం చేశారని బాధితులు వాపోతున్నారు. ఆరోజు పోలీసులు ఇద్దరు అమ్మాయిలను గుంపుకి వదలకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. అసలు ప్రభుత్వం అల్లర్లు మొదలైనప్పుడే చర్యలు తీసుకుంటే ఇంతటి దుస్థితి కలిగేది కాదని అంటున్నారు. దీంతో ఈ కీచక పర్వంలో పోలీసుల పాత్ర కూడా ఉందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భయపడి వదిలేశారో లేక వేరే కారణం ఏదైనా ఉందో తెలీదు గానీ బాధితులు చెప్తున్న దాని ప్రకారం.. పోలీసులకు మణిపూర్ ఘటన తాలూకు పాపం తగులుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బాధితులు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.