ముగ్గురు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి జరిగిందంటే ఏమీ చేయలేని దుస్థితి అనుకోవచ్చు. కానీ పట్టపగలే అమ్మాయిలను ఎత్తుకెళ్ళి మరీ బహిరంగప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు.
సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యామని సంబరపడాలో లేక మనిషి మానవత్వం మరిచి పైశాచికంగా ప్రవర్తిస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. ఈ ఘటన చుస్తే.. సంబరపడడం కాదు.. సిగ్గుతో తలదించుకోవాలేమో అనిపిస్తుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత వీడియో బయటకు రావడంతో మణిపూర్ కొండ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన మే 4న కంగ్పోక్పి జిల్లాలో చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ స్టేట్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న తర్వాత రోజు చోటు చేసుకుంది.
అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు. ఈ గ్యాంగ్ 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేయగా.. ఆపేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిని హతమార్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
ముగ్గురు మహిళలతో బలవంతంగా అందరి ముందు దుస్తులు విప్పించినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మణిపూర్ లో మే 4న జరిగిన హింసాకాండ తర్వాత సుమారు 800 నుంచి 1000 మంది వ్యక్తులు ఏకే రైఫిల్స్, ఎస్ఎల్ఆర్, ఐఎన్ఎస్ఏఎస్, .303 రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలతో మానిప్పోర్ గ్రామంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా దుకాణాలను దోచుకున్నారని, ఇల్లు, ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. మెయిటీ లీపన్, కంగ్లైపాక్ కంబ లప్, అరంబై టెంగోల్, వరల్డ్ మీట్ కౌన్సిల్ వంటి సంస్థలకు చెందిన మెయిటీ కమ్యూనిటీకి సభ్యులుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ హింసాత్మక ఘటన నుంచి ఇద్దరు మగవాళ్ళు, ముగ్గురు మహిళలు తప్పించుకుని సమీప అడవికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ కి 2 కి.మీ. దూరంలో ఈ ఐదుగురిని గ్యాంగ్ అపహరించింది. ముగ్గురు మహిళలను వివస్త్రగా మార్చి అత్యాచారం చేస్తుండగా ఒక 19 ఏళ్ల అమ్మాయి సోదరుడు అడ్డుకోగా అతన్ని చంపేశారు. అనంతరం ఆమెను గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. ఘటన తర్వాత ఆమె తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై రాజకీయ నాయకులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మణిపూర్ ఘటన నిజంగా సిగ్గు చేటు అని అన్నారు.