సాధారణంగా ఎక్కడైనా సరే హిజ్రాలను హీనంగా చూస్తుంటారు. సమాజం నుంచి వివక్ష ఎదురైనప్పటికీ కొంతమంది ట్రాన్స్ జెండర్లు పట్టుదలతో ఉన్నత స్థితికి చేరిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
సాధారణంగా ట్రాన్స్‌జెండర్స్‌ను ఈ సమాజం తక్కువ చూపు చూస్తుందని.. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ సమాజంలో తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్ జెండర్లు. రోడ్లపై వారిని చూసి హేళనగా మాట్లాడటం.. కొన్నిసార్లు భౌతిక దాడులకు పాల్పపడటం లాంటివి చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వారిని వదిలించుకుంటేనే మంచిదని భావిస్తుంటారు.. కొంతమంది తమ ఇళ్ల నుంచి వెలివేస్తుంటారు. కానీ.. ఇటీవల ట్రాన్స్‌జెండర్స్ పలు రంగాల్లో సత్తా చాటుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. తాజాగా తొలిసారి మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను ఓ ట్రాన్స్ జెండర్ మహిళ గెల్చుకుంది. వివరాల్లోకి వెళితే..
మిస్ నెదర్లాండ్స్ టైటిల్ ని తొలిసారిగా ట్రాన్స్ జెండర్ మహిళ రిక్కీ వలెరీ కొల్లే గెల్చుకుంది. ఎంతోమంది అందెగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనగా ఓ ట్రాన్స్ జెండర్ మహిళ మిస్ నెదర్లాండ్స్ టైటిల్ ని దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు. 22 ఏళ్ల రిక్కీ వలెరీ కొల్లే పోటీల్లో మోడల్స్ ని ఓడించడం గమనార్హం. అమస్టర్ డామ్ లో జరిగిన కార్యక్రమంలో మోడల్ రిక్కీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఎల్ సాల్వాడార్ లో జరగబోయే 72వ మిస్ యూనివర్స్ పోటీలకు రిక్కీ ఎంపికైంది.
టైటిల్ గెల్చుకున్న తర్వాత రిక్కీ తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా వ్యక్తం చేసింది. ‘ఈ మధుర క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా’అంటూ పోస్ట్ చేసింది. ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్ లోడ్ చేసింది. రిక్కీ జన్మతహ పురుషుడిగా పుట్టింది. తాను మహిళలకు రోల్ మోడల్ కావాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. తమపై చూపించే వివక్షకు వ్యతిరేకంగా పోరాడనున్నట్లు తెలిపింది.