ప్రపంచంలోనే తొట్టతొలి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా గుర్తింపు పొందిన ఆమె ఇకలేరు. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన ఆమె మరణంపై ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ప్రపంచంలోనే తొట్టతొలి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ చట్టసభ మాజీ ప్రతినిధి జార్జినా బెయెర్ (65) కన్నుమూశారు. చాన్నాళ్లుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బెయెర్ మృతి చెందిన విషయాన్ని ఆమె ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. న్యూజిలాండ్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన బెయెర్.. తొలినాళ్లలో సెక్స్ వర్కర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత నటిగా ప్రేక్షకులను అలరించారు. కార్టర్టన్కు మేయర్‌గా బెయెర్ ఎన్నికయ్యారు. తద్వారా ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు.
1999లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి నెగ్గిన తొలిసారే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు బెయెర్. 2007 వరకు ఆమె ఎంపీగా కొనసాగారు. రాజకీయాలను పక్కనబెడితే.. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన న్యాయవాదిగానూ జార్జినా బెయర్ గుర్తింపును పొందారు. సెక్స్ వర్కర్ల వివక్ష మీద గళమెత్తిన వారికి ఆమె అండగా నిలిచారు. న్యూజిలాండ్‌లో వ్యభిచారం నేరం కాదనే చట్టాన్ని తీసుకురావడంలో బెయెర్ కృషి ఎంతో ఉంది. అలాగే స్వలింగసంపర్కుల వివాహ చట్టం తయారీలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. అలాంటి బెయెర్ 2014లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడాయి. గతం వారం రోజులుగా బెయెర్ తన మిత్రులు, సన్నిహితులతోనే గడిపారని తెలుస్తోంది. ఆమె మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.