ఆడవాళ్లు.. అనగానే బలహీనుల అనే భావన ఉంటుంది. కానీ నా అనుకున్న వారికి కష్టం, ఆపద వస్తే.. ఆమె సివంగి అవుతుంది. ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేసి.. తన వారిని కాపాడుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భర్త కోసం ఓ భార్య ప్రాణాలకు తెగించి మరీ చేసిన పోరాటం.. నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
మన పురాణాల్లో మహా పతివ్రత సతి సావిత్ర గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. భర్త ప్రాణాల కోసం ఆమె ఏకంగా యముడిని ఎదిరించి..పోరాడి.. భర్త ప్రాణాలను దక్కించుకుంటుంది. మరి ఆమె అంత సాహసం ఎందుకు చేసింది.. అంటే భర్త మీద ప్రేమ, అనురాగం. పతియే ప్రత్యక్ష దైవం అంటూ మన పెద్దలు చెబుతూ వచ్చారు. మహిళలు కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. భర్త మంచి వాడైనా, మూర్ఖుడైనా, రోగిష్టి అయినా.. చెడు అలవాట్లకు బానిస అయినా.. అసలు కుటుంబాన్ని పట్టించుకోని వ్యక్తి అయినా సరే.. భార్య.. అతడిని ప్రేమిస్తుంది, భరిస్తుంది, సేవిస్తుంది. తన తల్లిదండ్రుల దగ్గర అల్లారుముద్దుగా పెరిగిన మహిళ.. పెళ్లి తర్వాత భర్తే లోకంగా బతుకుతుంది.
అనుక్షణం అతడికి చేదోడువాదోడుగా ఉంటుంది. తన జీవితాన్ని.. అతడికి అంకింత చేస్తుంది. అయితే భర్త కోసం ఇంత చేసిన భార్య అంటే.. చాలా మంది మగవాళ్లకు చులకన భావం. నలుగురిలో తన భార్య మీద జోక్‌లు వేస్తూ.. ఆమెను కించపరుస్తూ.. శునకానందం పొందే భర్తలు ఎందరో ఉన్నారు. కానీ భార్య మాత్రం.. కష్టం, సుఖం, బాధ ఇలా ప్రతి సందర్భంలో భర్తకు తోడుగా ఉంటుంది. ఇక తాజాగా ఓ మహిళ భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంతటి సాహసం చేసిందో తెలిస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ వివరాలు..
నీళ్లు తాగడానికి నది వద్దకు వెళ్లిన భర్తపై మొసలి దాడి చేసింది. అతడిని నోట కరుచుకుని.. నీళ్లలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. భయంతో అతడు కేకలు వేయడంతో.. అది విన్న భార్య.. పరిగెత్తుకు వచ్చింది. భర్తను ఆ స్థితిలో చూసి ఆమె భయపడింది. కానీ అతడి ప్రాణం కాపాడటం కోసం.. తన ప్రాణాలకు తెగించి మరి మొసలితో పోరాడి.. భర్తను కాపాడుకుంది. ఈ సంఘటన రాజస్థాన్, మండరాయల్ సబ్ డివిజన్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన బనీసింగ్ మీనా అనే వ్యక్తి మేకలను కాయడానికి అడవికి వెళ్లాడు.
ఈ క్రమంలో వాటిని నీళ్ల కోసం చంబల్ నది వద్దకు తోలుకెళ్లిన బనీసింగ్ మీనా.. తనకూ దాహంగా ఉండటంతో నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడు. నదిలోకి వంగి.. రెండు దోసిళ్లతో నీరు తీసుకుని తాగబోతుండగా.. నది లోపలి నుంచి ఓ మొసలి బయటకు వచ్చి బనీసింగ్‌పై దాడి చేసింది. అతడి కాలిని నోట కరచి నీటి లోపలికి లాక్కొని పోయేందుకు ప్రయత్నించింది. ఊహించని ఈ ఘటనతో భయపడ్డ బనీసింగ్ ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశాడు.
నదికి కొద్ది దూరంలో ఉన్న బనీసింగ్ భార్య విమలాబాయి.. భర్త కేకలు విని అక్కడికి చేరుకుంది. ఎదురుగా భయంకర దృశ్యం. తన భర్త ప్రాణం.. మొసటి నోటిలో ఉంది. ఆ పరిస్థితిని చూసి భయంతో బిగిసుకుపోయింది. కానీ వెంటనే తేరుకున్న ఆమె.. ధైర్యంగా అక్కడకు వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై కొడుతూనే ఉంది. పావుగంట పాటు ఆమె మొసలితో పోరాటం చేసింది. ఈ క్రమంలో దెబ్బల బాధ భరించలేక చివరకు ఆ మొసలి బనీసింగ్ కాలు వదిలేసి నీటిలోకి వెళ్లిపోయింది. ఈలోపు చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా అక్కడికి చేరుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా విమలాబాయి మాట్లాడుతూ.. ‘‘నా భర్త అరుపులు విని.. నేను నది దగ్గరకు పరిగెత్తుకెళ్లాను. అక్కడికి వెళ్లి చూస్తే.. మొసలి నా భర్తను చంపి తినేయడానికి రెడీ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నా భర్త ప్రాణాలే నాకు ముఖ్యం. అంతే ఇక నేను నా గురించి ఆలోచించలేదు.. ఎలాగైనా నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్నాను. అందుకే సాహసించి.. మొసలితో పోరాటం చేశాను. చివరకు నా భర్తను కాపాడుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
తాను ఆ నిమిషం మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుసని, కానీ ఆ క్షణంలో తన భర్తను కాపాడుకోవడం ఒక్కటే తన ముందున్న ధ్యేయం కావడంతో భయం వేయలేదని విమలాబాయి తెలిపింది. ‘‘కళ్ల ముందు మృత్యువు కనిపించింది.. తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది’’ అంటూ బనీసింగ్ తన భార్య చేసిన సాహసం గురించి తెలిపాడు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భర్త కోసం ఆమె చూపిన తెగువను ప్రశంసిస్తున్నారు నెటిజనులు. మరి విమలాబాయి చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.