మానవ జీవితాన్ని కబళించివేసింది కరోనా. సమాన్య పౌరుడు కరోనా పేరువిన్నా గడగడలాడిపోయాడు. లాక్ డౌన్ లో పడిన కష్టాలు వర్ణనాతీతం. ఏ కాస్త అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ ఆ చీకటి రోజులు వస్తాయంటున్నారు నిపుణులు. కరోనా పోయి సాధారణ జీవితం మొదలవుతోందని ఆనందపడే లోపే మరో ప్రళయం ముంచుకొస్తోందని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి ఒమిక్రాన్ లా మళ్లీ దూసుకొస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే 30 దేశాలకుపైనే చుట్టేసింది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటం భయాందోళనకు గురిచేస్తోంది. అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ నిపుణులు చెప్తున్నారు.
అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా దీనిని అదుపు చేయడంలో విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి ఒమిక్రాన్ ఎదుర్కోవడం ఎలా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకు నిపుణులు ఒకటే ఆన్సర్ చెప్తున్నారు. ఒమిక్రాన్ సమర్ధంగా ఎదుర్కోవాలంటే అందుకు టీకా ఒక్కటే మార్గం అంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ హెచ్చరిస్తున్నారు. కనీసం ఒక్క డోసు టీకా కూడా తీసుకోని వారికి ప్రమాదం పొంచి ఉందని సీసీఎంబీ డైరెక్టర్ హెచ్చరిస్తున్నారు. ‘టీకా తీసుకోని వారికంటే ఒక డోసు తీసుకున్న వారు కొత్త వేరియంట్ ను ఎదుర్కోగలరు. ఒక డోసు కంటే రెండు డోసుల టీకా తీసుకున్న వారు మెరుగ్గా కొత్త వేరింట్ ను తట్టుకోగలరు. రెండు డోసుల టీకా తీసుకున్నా కూడా వారికీ కరోనా వచ్చే అవకాశం ఉంది. అయితే టీకా తీసుకోని వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారికి ప్రాణాపాయం ఉండదు. కొత్త వేరియంట్ ను సమర్ధంగా ఎదుర్కోవడానికి బూస్టర్ డోస్ కూడా అవసరం ఉండచ్చు’ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
కొత్త వేరియంట్ పై మరింత అధ్యయనాలు జరిపితే తప్ప దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితంగా చెప్పలేం. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ స్పైక్ ప్రొటీన్ లో 32 ఉత్పరివర్తనాల కారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ ను సమర్ధంగా ఎదుర్కోగలుగుతోందని అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ ను ఎదుర్కోవాలంటే రెండో మార్గాలు ఒకటి టీకా, రెండు స్వీయ భద్రత అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక డోసు కూడా తీసుకోని వారు వెంటనే టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ తో మూడో దశ కరోనా రానుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.