సినిమా వాళ్లు కావచ్చు.. ఇతర రంగాలకు చెందిన సెలెబ్రిటీలు కావచ్చు.. పలు వస్తు లేదా సేవలకు సంబంధించిన వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వారి కారణంగా జనాల్లోకి సరదు ఉత్పత్తులు వేగంగా వెళ్లిపోతాయి. మంచి ప్రచారం పొందుతాయి.
బ్రాండ్ ప్రమోషన్.. ఏదైనా వస్తువు లేదా సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి, వారిని ఆ వస్తువు లేదా సేవల గురించి తెలుసుకునేలా చేసి, వినియోగించుకునేలా ప్రేరేపించడాన్ని బ్రాండ్ ప్రమోషన్ అంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వస్తు లేదా సేవలకు సంబంధించిన కంపెనీలు తమ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి బ్రాండ్ ప్రమోషన్‌ను ఆశ్రయిస్తూ ఉంటాయి. సెలెబ్రిటీల ద్వారా తమ వస్తువులను ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. భారత దేశంలో సినిమా, క్రీడా రంగానికి చెందిన వారు ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. వారి అభిమానులు, సాధారణ జనం వారి కారణంగా ఆ వస్తువుల్ని, సేవలను వినియోగిస్తూ ఉంటారు. అయితే, చాలా సార్లు తాము ఆశించిన ఫలితాలు రాక సదరు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు.
సదరు బ్రాండ్, దాన్ని ప్రచారం చేసిన సెలెబ్రిటీల మీద ఫిర్యాదులు చేసిన వినియోగదారులు కూడా చాలా మంది ఉన్నారు. అయినా బ్రాండ్ ప్రమోషన్‌లో ఎలాంటి మార్పులు రావటం లేదు. ముఖ్యంగా ఆరోగ్యం, అలంకారానికి సంబంధించిన ఉత్పత్తుల్లో విశ్వసనీయత కొరవడుతోంది. సెలెబ్రిటీలను నమ్మి వస్తువుల్ని వాడిన వారికి అసంతృప్తి మిగులుతోంది. వినియోగదారుల కష్టాలపై చలించిన కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ ప్రమోషన్‌లపై సెలబ్రిటీలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్‌సూమర్ ఎఫైర్స్ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. సెలెబ్రిటీలు ఏదైనా వస్తు, లేదా సేవలను ప్రమోట్ చేసే ముందు వాటిని తప్పకుండా వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాటి ద్వారా ఎదురైన అనుభవాలను తెలుపుతూ ప్రచారం చేయాలని పేర్కొంది. చేసే ప్రచారం కూడా అందరికీ అర్థమయ్యే సాధారణ భాషలో ఉండాలని అంది. ఫొటో లేదా వీడియోల ద్వారా చేసే ప్రచారం స్పష్టంగా ఉండాలని తెలిపింది. ఓ వస్తువులో లేని గుణాల గురించి చెప్పి ప్రచారం చేయటం నేరమని వెల్లడించింది. దాన్ని తప్పుదోవ పట్టించే ప్రచారంగా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. మరి, వినియోగదారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన మార్గదర్శకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.