NEET: కేరళలోని కొల్లాంలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది దారుణంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రం కేటాయించారు. ఇక, పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలను అక్కడి సిబ్బంది నిశితంగా తనిఖీలు చేశారు. ఎన్టీఏ మార్గదర్శకాల్లోని డ్రెస్‌కోడ్ ప్రకారం.. లోహపు(మెటల్) వస్తువులు ధరించి వస్తే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించరు. లోదుస్తులకు సంబంధించి అక్కడి సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో, తీవ్ర అవమానకర పరిస్థితుల్లో విద్యార్థినులు తమ లోదుస్తులు విప్పేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.
పరీక్ష హాల్లో సిబ్బంది వ్యవహార శైలి దేశ వ్యాప్తంగా పెను వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అవమానాన్ని గురించి ఓ విద్యార్థిని మీడియాతో షేర్ చేసుకుంది. విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘ మెటల్ హుక్స్ ఉన్న బ్రా వేసుకున్న వారిని, మామూలు హుక్స్ బ్రా వేసుకున్న వారిని రెండు లైన్లుగా నిలబెట్టారు. సాధారణ చెకింగ్ కోసం అనుకున్నాం. కానీ, గది వద్దకు వెళ్లగానే లోదుస్తులు విప్పేయాలని ఓ మహిళా సిబ్బంది ఆదేశించారు. అక్కడే ఉన్న డ్రాలో వాటిని పెట్టాలన్నారు.
అబ్బాయిలు, అమ్మాయిల దుస్తులన్నీ ఒకే చోట పెట్టారు. పరీక్ష హాలులో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చోట కూర్చున్నాం. మెడలో చున్నీ కూడా లేదు. చాలా మంది జుట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాశాం. అవమానకరంగా అనిపించింది. పరీక్ష మీద దృష్టి పెట్టలేకపోయా. పరీక్ష అయిపోయాక ఇంటికి వెళ్లే టప్పుడు లోదుస్తుల్ని మాతో తీసుకువెళ్లాలని అన్నారు. చాలా మంది ఏడ్చారు. మరికొంత మంది అధికారులు వద్దన్నా వినకుండా.. అక్కడే గదిలో చీకటిగా ఉన్న చోట చేరి లోదుస్తులు మార్చుకున్నాం.
తర్వాత ఇంటికి వెళ్లాం. చిన్న గదిలో అలా దుస్తులు ధరించాల్సి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎన్‌టీఎ తరుపున విధులు నిర్వహించిన ముగ్గురు మహిళల్ని, మరో ఇద్దరు కాలేజ్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తోపుడు బండి వ్యాపారికి ఏకే-47లతో ఇద్దరు బాడీగార్డ్స్.. ఎందుకంటే!