ఆడపిల్ల అయితే చాలు.. వయసుతో సంబంధం లేకుండా.. వావి వరసలు మరిచి మరి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు అనేకమంది ఉన్నారు. ఇక ఆడవాళ్లు ఒంటరగా కనిపిస్తే.. చాలు నోటికి పని చెప్పి.. అడ్డమైన కారు కూతలు కూసేవారు కోకొల్లలు. తిరిగి ఏమనరనే ధైర్యంతో అడ్డమైన చెత్త వాగుడు వాగుతూ.. శునకానందం పొందే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలె తాజాగా ముంబై ప్రత్యేక కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. అమ్మాయిని ఉద్దేశించి పిచ్చి వ్యాఖ్యలు చేసినందుకు ఓ యువకుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది కోర్టు. ఏడేళ్ల నాటి ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఇక్కడ నిందితుడు.. సంఘటన జరిగిన సమయంలో మైనర్ బాలికను ఉద్దేశించి ఐటమ్ అని పిలిచాడు. ఆమె జుట్టు పట్టుకుని లాగాడు. దీనిపై బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కోర్టును ఆశ్రయించడంతో తాజాగా తీర్పు వెల్లడయ్యింది. ఆ వివరాలు..
ఈ సంఘటన, కేసు నమోదు వంటి సంఘటనలు 2015లో జూలైలో చోటు చేసుకున్నాయి. 16 ఏళ్ల బాధితురాలు ఆ ఘటనకు నెల రోజుల ముందు ముంబయిలోని సకినాకాకు వెళ్లింది. నిందితుడైన బాలుడు దారిలో వెళ్తున్న అమ్మాయిలను ఆటపట్టించేవాడు. దానిలో భాగంగానే నిందితుడు.. బాధితురాలిని నిత్యం ఫాలో అవుతూ పదే పదే ఆమెను ‘ఐటమ్’ అని పిలిచేవాడు. నిందితుడితో పాటు అతని గుంపులోని ఇతర అబ్బాయిలు కూడా బాధితురాలిని ఇలానే కామెంట్ చేస్తూ.. చెడు దృష్టితో చూసేవారు. ఈ క్రమంలో జూలై 14, 2015 న, బాధితురాలు పాఠశాల నుండి తిరిగి వస్తుండగా, నిందితుడు బాలిక వెనకే వస్తు.. ఆమె జుట్టు పట్టుకుని లాగి.. ఐటమ్ ఎక్కడికి వెళ్తుంది అని కామెంట్ చేశాడు.
అప్పటి వరకు అతడి చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు.. ఓపిక నశించి పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ ‘100’ కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చే సమయానికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 354 కింద పోలీసులు నిందితుడి మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఒక మహిళ గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో ఆమెపై దాడి లేదా బలవంతం చేసిన సందర్భాలలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా పోలీసులు సదరు నిందితుడి మీద అదే సెక్షన్‌ని వినియోగించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు.. నిందితుడిని ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద దోషిగా నిర్ధారించి.. అతడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సాధారణంగా ‘ఐటెమ్’ అనే పదాన్ని అబ్బాయిలు.. అమ్మాయిలను అవమానకరమైన రీతిలో సంబోధించడానికి ఉపయోగించే పదం. ఇలాంటి పదాలు వాడటం.. ఆడవారిని లైంగికంగా వర్ణించడం కిందకు వస్తుంది. అంతేకాక ఇలాంటి పదాల వాడకం.. స్త్రీ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మహిళలను అన్యాయం, అగౌరవం నుంచి కాపాడేందుకు ఇలాంటి వేధింపులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నందున ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.