ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ వాడకం ఈమధ్య బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి యూట్యూబ్‌లో చూసి ఓ మైనర్ బాలిక సొంతంగా కాన్పు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే..!
ఇంటర్నెట్ విప్లవంతో సాంకేతికతను వినియోగించడం బాగా పెరిగిపోయింది. ఫోన్లలోనే అన్నీ నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ సర్వాంతర్యామిగా మారిపోయింది. ఒక్క క్లిక్‌తో ఏదైనా బుక్ చేయొచ్చు. ఇక, యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్‌ఫామ్స్‌ను ఎంటర్టైన్మెంట్తో పాటు నచ్చిన విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు మాత్రం వీటిని ఇష్టం వచ్చినట్లు వాడి ఇబ్బందుల పాలవుతున్నారు. మహారాష్ట్రలో ఓ మైనర్ బాలిక ఇలాగే యూట్యూబ్ వీడియోలు చూసి తనకు తానే ప్రసవం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది.
తీవ్రరక్తస్రావంతో ఆ బాలిక కూడా అనారోగ్యానికి గురైంది. బాలిక తల్లి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తోంది. వివరాలు.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని అంబజారీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 2న ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక యువకుడి ద్వారా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఇంట్లోవారికి చెప్పకుండా దాచిపెట్టింది. పొట్ట ఉబ్బెత్తుగా ఉండటంతో తల్లి ప్రశ్నించగా.. హెల్త్ ఇష్యూగా చెప్పుకొచ్చింది. ఆస్పత్రికి వెళ్దామని చెప్పినా అదే నయం అవుతుందని దాటవేసింది. ఈ క్రమంలో మార్చి 2న తల్లి కూలీ పనులకు వెళ్లిన సమయంలో బాలికకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనను భరించలేకపోయిన బాలిక.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి తనకు తానే ప్రసవం చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన ఆడబిడ్డను గొంతునులిమి చంపేసింది.
శిశువు మృతదేహాన్ని ఒక పెట్టలో పెట్టి ఇంట్లో ఓ మూలన దాచి పెట్టింది. తీవ్రరక్తస్రావంతో కదల్లేని స్థితిలో ఉన్న బాలిక… ఇంట్లోనే అచేతనంగా ఉండిపోయింది. కూలీ పనులకు వెళ్లొచ్చిన తల్లి ఇంట్లో రక్తపు మరకలు, బాలిక ఆరోగ్య పరిస్థితిని చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం బాలికకు చికిత్స అందుతోంది. కాగా, బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడు ఆమెకు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడని తెలిసింది. ఏక్ ఠాకూర్ అనే ఆ యువకుడితో బాలిక కొన్నాళ్లు చాట్ చేసింది. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరగడంతో తొమ్మిది నెలల కింద వీళ్లు కలుసుకున్నారు. ఈ క్రమంలో బాలికను ఫ్రెండ్ రూమ్‌కు తీసుకెళ్లిన యువకుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమె మీద అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఇక, బాలిక తల్లి కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏక్ ఠాకూర్‌ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.