ఇటీవల న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులు ఊహాతీతంగా ఉంటున్నాయి. గతంలో సహజీవనం తప్పుకాదన్న కోర్టు.. ఆరు నెలల వ్యవధి ఇవ్వకుండానే విడాకులు ఇవ్వొచ్చునని పేర్కొంది. అలాగే వ్యభిచారం విషయంలో ముంబయి కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఇటీవల న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులు ఊహాతీతంగా ఉంటున్నాయి. నేటి పరిస్థితులకు తగ్గట్లు తీర్పులు వస్తున్నాయా అన్న అనుమానం కలుగకమానదు. ఈ తీర్పులు సామాన్యులను సందిగ్ధంలోనూ పడేస్తున్నాయి. కొన్ని సార్లు వివాదాస్పదం కూడా అవుతున్నాయి. ఉదాహరణలకు ఇద్దరు వ్యక్తులు ఇష్టమైతే.. సహజీవనం తప్పుకాదంటున్నాయి ఈ కోర్టులు. సహజీవనం (లైవ్-ఇన్-పార్టనర్స్) చేస్తున్న వారి మధ్య పరస్పర అంగీకారంతో చేసే సెక్సు అత్యాచారం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇద్దరి ఏకాభిప్రాయంతో ఆరు నెలల సమయం ఇవ్వకుండానే విడాకులు మంజూరు చేయవచ్చునని పేర్కొంది మరో న్యాయ స్థానం. తాజాగా ముంబయి కోర్టు ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది. ఇంతకూ అదేటంటే.. వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టును సమర్థించింది.
వ్యభిచారం నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన ముంబయి కోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం నేరమేనంటూ పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలోని ములాండ్ ప్రాంతంలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్ చేశారు. ఆ సమయంలో 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరు పరిచిన సమయంలో స్థానిక కోర్టు సంరక్షణ కేంద్రంలో ఉంచాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విచారణ సందర్భంగా ముంబయి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. వ్యభిచారం నేరం కాదని, బహిరంగ ప్రాంతాల్లోవ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని, అప్పుడు అది నేరం కిందకు వస్తుందని పేర్కొంది. ఆమెను ఎందుకు నిర్భంధంచారంటూ ప్రశ్నించింది. బాధితురాలు మేజర్ అని…ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించారని పైగా వ్యభిచారం చేస్తోందన కారణంతో ఆమెను నిర్బంధిస్తే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని స్పష్టం చేసింది. ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది. కేవలం చేస్తున్న వృత్తి ఆధారంగా బాధితురాలిని అదుపులోకి తీసుకోవడం, నిర్బంధించడం సరికాదన్నారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి తల్లి కావాలని, బాధితురాలిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధిస్తే, అది ఆమె హక్కులను హరించినట్లేనని అన్నారు. సెక్స్ వర్కర్ల హక్కుల గురించి చర్చించిన సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉదహరణగా చెప్పారు. మేజర్ అయిన ఆమెను ఇష్టానికి విరుద్ధంగా కేర్ సెంటర్‌లో నిర్బంధించినందున వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.