సాధారణంగా పాములు పగబడుతాయని జనాలు అనుకుంటారు. అలాంటి సన్నివేశాలు ఎన్నో సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో చూస్తుంటాం. దానికి సంబంధించిన కొన్ని సంఘటనలు ఆ నోటా.. ఈ నోటా వింటుంటాం. కానీ కోతి పగబట్టడం ఎక్కడైనా చూశారా..? అవును కర్ణాటకలో ఒక కోతి మాత్రం ఓ వ్యక్తిపై పగను పెంచుకుంది. పగ పట్టడమే కాదు.. 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో ఆ కోతిని విడిచిపెట్టినప్పటికీ, ఓ లారీలో మళ్లీ అదే గ్రామానికి వచ్చిన ఆ కోతి సదరు వ్యక్తి కోసం గంటలపాటు తీవ్రంగా గాలించింది.
అయితే అంతగా ఆ కోతి పగ పెంచుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందామా.. కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగలూర్ జిల్లాలోని కొట్టిఘెహరా అనే గ్రామంలో ఐదేండ్ల వయసున్న ఓ మగకోతి స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. ఇండ్ల పెంకులను పడేయడం, ఇంట్లో వస్తువులు.. ఆహారాన్ని ఎత్తుకు వెళ్లడం లాంటివి చేయడం మొదలు పెట్టింది. సరే కోతి చేష్టలు అనుకొని గ్రామస్థులు సర్ధుకు పోతూ వచ్చారు. ఇటీవల పాఠశాలలు తెరిచారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్న సమయంలో కోతి వారిపై దాడి చేయడం మొదలు పెట్టింది.. దాంతో పిల్లలు భయపడి స్కూల్ వెళ్లడం ఆపారు. ఇక గ్రామస్థులకు చిర్రెత్తుకొచ్చి గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కోతిని పట్టుకోవడానికి సెప్టెంబర్ 16న గ్రామానికి వచ్చిన అధికారులకు ఆ వానరాన్ని బంధించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న ఆటో డ్రైవర్ జగదీశ్ అధికారులకు కోతిని పట్టుకునేందుకు సహాయం చేశాడు.
మొత్తానికి ఆ కోతిని అధికారులు బంధించారు.. ఆ సమయంలో తనను పట్టించాడని గమనించిన ఆ కోతి అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్ పై దాడి చేసింది. కోతికి భయపడి జగదీశ్ తన ఆటోలో దాక్కున్నాడు. ఆటో టాప్, సీట్లను చించి.. జగదీశ్‌పై దాడి చేసి చెవులు కొరికి, ఒళ్లంతా రక్కేసింది. వెంటనే అధికారులు దాన్ని మళ్లీ బంధించారు. ఆ కోతిని ఊరికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో దాన్ని విడిచిపెట్టారు. హమ్మయ్య కోతి పీడ వదిలిందిరా బాబూ అంటూ జగదీశ్ తో పాటు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్.. అడవిలో ఉన్న ఆ కోతి లారీ ఎక్కి మరీ ఆ గ్రామానికి వచ్చింది. కోతి చెవిమీద ఉన్న గుర్తును గమనించిన గ్రామస్థులు ఆ వానరం.. మునుపటిదేనని గుర్తించారు. అయితే అది జగదీశ్ కోసం వెతుకుతున్నట్లు గమనించిన గ్రామస్థులు ఈ విషయం అతనికి చేరవేశారు. దాంతో కోతి కంట కనబడకుండా జగదీశ్ దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించి తీసుకెళ్లారు. మళ్లీ ఆ కోతి ఎప్పుడు వస్తుందో.. తనపై దాడి ఎప్పుడు చేస్తుందో అని భయంతో వణికిపోతున్నాడు జగదీశ్.