కంటిలో తీవ్ర ఇబ్బంది తలెత్తటంతో ఆసుపత్రికి వెళ్లాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అకాంతమొయిబా కెరటిటిస్ వచ్చినట్లు తేల్చారు. మాంసం తినే బ్యాక్టీరియా అతడి కంటిని తినేసినట్లు వెల్లడించారు. చికిత్స కోసం 10 వేల డాలర్లు అవుతుందని అన్నారు.
సాధారణంగా కంటి చూపు సమస్యలు ఉన్న వారు కంటి అద్దాలు వాడుతూ ఉంటారు. కంటి అద్దాల కారణంగా అందం చెడిపోతుంది. ఇబ్బంది అవుతుంది అని భావించిన వారు కాంటాక్ట్ లెన్స్‌లను వాడుతూ ఉంటారు. ప్రస్తుతం అందుబాటు ధరలోనే కాంటాక్ట్ లెన్స్‌లు దొరుకుతూ ఉన్నాయి. రకరకాల రంగుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది కాంటాక్ట్ లెన్స్‌లనే వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌ల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పొరపాట్లు జరిగినా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. కళ్లు కూడా పోయే అవకాశం ఉంది. తాజాగా, ఓ యువకుడు కాంటాక్ట్ లెన్స్ కారణంగా ఓ కన్ను పాడుచేసుకున్నాడు. మాంసం తినే బ్యాక్టీరియా అతడి కంటిని తినేసింది. ఈ సంఘటన అమెరికాలో ఆసల్యంగా వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుమ్‌హోల్ అనే 21 ఏళ్ల యువకుడు దాదాపు 7 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉన్నాడు. అప్పుడప్పడు రాత్రి వేళ కాంటాక్ట్ లెన్స్‌ను తీసి పడుకోవటం మర్చిపోయేవాడు. ఉదయం లేచినపుడు కళ్లు ఎర్రగా మారేవి. అంతకంటే ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. కానీ, నెల రోజుల క్రితం డ్యూటీనుంచి ఇంటికి వచ్చిన అతడు అలసట కారణంగా కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి కుడి కన్ను కొంత కలర్ మారింది. నొప్పి రావటం మొదలైంది. దీంతో అతడు ఆసుపత్రికి వెళ్లాడు. మైక్ క్రుమ్‌హోల్ కంటిని పరీక్షించిన వైద్యులు అతడి కుడి కంటిలో అకాంతమొయిబా కెరటిటిస్ అనే వ్యాధి వచ్చినట్లు తేల్చారు.
మాంసం తినే బ్యాక్టీరియా అతడి కంటిని తినేసిందని చెప్పారు. ఆ కంటిని బాగుచేయ్యాలంటే అక్షరాల పది వేల డాలర్లు ఖర్చు అవుతుందని అన్నారు. అంత డబ్బు తన దగ్గర లేకపోవటంతో అతడు ఫండింగ్ కోసం చూస్తున్నాడు. గోఫండ్ మీ అనే సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నాడు. అతడి కష్టం గురించి తెలుసుకున్న కొందరు 1000 డాలర్లు సహాయం చేశారు. కాంటాక్ట్ లెన్స్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పడుకునే ముందు, స్నానం చేసే ముందు వాటిని ధరించవద్దని మైక్ హెచ్చరిస్తున్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.