తన స్నేహితురాలిని కలిసేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన ఒక కుర్రాడు అడ్డంగా బుక్కయ్యాడు. మహిళా కళాశాలలో చదువుకుంటున్న స్నేహితురాలిని రహస్యంగా కలిసేందుకు ఆడపిల్లలా బుర్ఖా ధరించి కాలేజీలోకి ప్రవేశించాడు. స్నేహితురాలి గదిలోకి ప్రవేశిస్తుండగా అక్కడున్న ఓ మహిళా ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి నడక తీరు ఏంటి ఇలా ఉంది అనుకుని సెక్యూరిటీని పిలిచి విచారించింది. సెక్యూరిటీ సిబ్బంది బుర్ఖా తొలగించి చూడ్డంతో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్‌లో గురువారం చోటు చేసుకుంది. బుర్హాన్‌పూర్‌లోని సేవా సదన్ కళాశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు బుధ్వారా నివాసి అయిన మొహ్సిన్ సాహాబ్ ఈ బుర్ఖా ధరించి ప్రవేశించాడు. కథ అడ్డం తిరగడంతో బుక్కయ్యాడు. కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం తన స్నేహితురాలిని కలిసేందుకే తను మారు వేషంలో వచ్చానని మొహ్సిన్ చెబుతున్నాడు.