పసుపు లేనిదే శుభకార్యం ఉండదు. పసుపు రంగు ఆనందానికి చిహ్నం. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు అనేది శుభానికి గుర్తు. ఆరోగ్యాన్ని కలిగించే ఓ ఔషధి. సంపదను ఇచ్చే కల్పవల్లి. పసుపును మనం నిత్యం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. శుభకార్యాల్లోనూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. ప్రధానంగా పెళ్లి విషయానికి వస్తే ప్రతి సందర్భంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ముఖ్యంగా వధూ వరులకు చేయించే మంగళ స్నానానికి ముందు వారికి పసుపు బాగా రాస్తారు. పసుపు మన చర్మానికి ఎంతో మంచిది. అందుకే చర్మానికి సంబంధించిన ఉత్పత్తులు తయారుచేసే చాలా సంస్థలు దీన్ని వాటి తయారీలో ఉపయోగిస్తున్నాయి. పెళ్లి సమయంలో సాధారణంగా కేవలం పసుపు మాత్రమే కాకుండా చందనం, పాలు లేదా రోజ్‌వాటర్‌ని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని పెళ్లి కూతురికి రాస్తారు. మరికొందరు ఇందులో పెరుగు, శెనగపిండి కూడా కలుపుతారు. దీన్ని రాసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు, మొటిమల వంటి సమస్యలు లేకుండా చర్మం తాజాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి పెళ్లికూతుళ్ల బ్యూటీ పార్లర్ ఇదే.
చాలామంది వధూవరులు పెళ్లికి ముందు కాస్త ఒత్తిడిగా ఫీలవ్వడం సహజమే. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నప్పుడు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి కాస్త నెర్వస్‌గా ఫీలవ్వడం సహజమే. కానీ పెళ్లికి ముందు పసుపు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గుతుందట. పసుపులోని కర్కుమిన్ ఒత్తిడిని తగ్గించడం మాత్రమే కాదు.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్లకు ఈ ఒత్తిడి సంగతి ముందే తెలుసేమో.. అందుకే పెళ్లికి ముందు పసుపును ఉపయోగించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.
శరీరంలో చేరిన దుష్ట శక్తులను పారదోలే పవర్ పసుపుకి ఉందట. అందుకే వధూవరులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు గాను వారికి పసుపు రాస్తారు. పసుపుతోపాటు చందనం, రోజ్ వాటర్ వంటి పదార్థాలను కలిపి వధూ వరులకు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. దీంతో వారిలో పెళ్లి కళ మరింత ఉట్టిపడుతుందని పలువురు భావిస్తారు. కొన్ని సీజన్లలో మీరు ఎల్లప్పుడూ తుమ్ము, దగ్గు మరియు చర్మ దద్దుర్లు అనుభవిస్తే, ఇది కాలానుగుణ అలెర్జీ కావచ్చు. అలెర్జీ చికిత్స ఎక్కువగా లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.
అలెర్జీని వదిలించుకోవడానికి పసుపు సహాయపడుతుంది. ఇది యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంది.పెళ్ళిల్లో తలస్నానాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతోమంది కలుస్తూ ఉంటారు. అలర్జీలకు చెక్ చెప్పడానికి పసుపుని మించిన దినుసు లేదు.