మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయే ఎవరూ చెప్పలేరు. ఇటీవల చాలా మంది గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు కానరాని లోకాలకు వెళ్తున్నారు.
ఇంట్లో అంతా పెళ్లి సందడి.. పెళ్లి భాజాలు మోగుతున్న వేళ.. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు. అంతలోనే ఆ పెళ్లి ఇంట్లో ఎంతో విషాదం నింపింది. మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో.. ఎవరికి తెలియదు. మనకు తెలియకుండానే నిత్య జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బోరి గ్రామంలో చెందిన గుండ్ల సాలయ్య, యశోద దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకి ముగ్గురు కొడుకులు. ఆ దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి(26) . ఇతనికి ఈ మధ్యకాలంలోనే.. మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం అయ్యింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెళ్లి ముహర్తం ఉంది. అతని కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు. పెళ్లి పనుల బిజీగా తిరుపతి వరుసగా ఎండలో తిరిగాడు. దీంతో సోమవారం రోజు వడదెబ్బకు గురై విపరీతమైన వాంతులు, విరేచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తిరుపతి కుటుంబసభ్యులు కాగజ్ నగర్ లో ఉండే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే చికిత్సా అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్యపరిస్థితి మరింతా విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ హాస్పిటల్ నుంచి మంచిర్యాలలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న తిరుపతి బుధవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలాడు. కొద్ది గంటల్లోనే పెళ్లి బంధంతో నూతన జీవితాన్ని ఆరంభించాల్సిన తిరుపతి అర్థాంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొద్దిరోజుల క్రితమే తిరుపతి సోదరుడు శ్రీనివాస్ ఆ గ్రామ సర్పంచ్ గా ఉన్నాడు. అతనికి ఆరు నెలల కిందట ఆరోగ్యం బాగలేక మృతిచెందాడు.