తల్లి నేలని, పల్లె సీమని… విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము… స్వర్గమివ్వగలదా గలదా..
జననానికి ఇది మా దేశం… మరణానికి మరి ఏ దేశం..?
అమృత సినిమాలోని ఓ పాటలోని లిరిక్స్ ఇవి. పుట్టిన గడ్డను విడిపోతున్నపుడు మనిషి ఎలా బాధపడతాడో తెలిపే పాట ఇది. 1990లో కాశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను వదిలి ప్రాణాలతో బయటకు పారిపోవాల్సి వచ్చినపుడు వారు పడ్డ బాధను తెలియజేయాలంటే ఇలాంటి పాటలు వంద కావాలేమో. తల్లిదండ్రుల్ని, అన్నదమ్మల్ని, అక్కచెల్లెళ్లను, కూతుళ్లను.. సొంతవాళ్లు, ప్రాణ స్నేహితులు ఇలా ఎవరో ఒకరిని కళ్లముందే కాల్చి చంపుతుంటే ఏమీ చేయలేని స్థితి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీసే పరిస్థితి. కాశ్మీరీ పండిట్లపై 1989 నుంచి మొదలైన ఈ మారణహోం.. 2003 వరకు కొనసాగింది.
ఇంతకీ ఎవరీ కాశ్మీరీ పండిట్లు..
కాశ్మీర్ లోయలో నివసించే పంచ గౌద బ్రాహ్మణలను కాశ్మీరీ బ్రాహ్మణులని కాశ్మీరీ పండిట్లని పిలుస్తుంటారు. 1557లో కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న అక్బర్ చక్రవర్తి వీరిని బాగా గౌరవించాడు. వీరి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, తెలివితేటలు ఆయనను ఆకర్షించడంతో వీరికి ‘ పండిట్లు ‘ అంటూ బిరుదువంటిదిచ్చాడు. ఇక అప్పటినుంచి వీరిని కాశ్మీరి పండిట్లు అని పిలవటం మొదలైంది.
కాశ్మీరీ పండిట్లపై దాడులు ఎందుకు మొదలయ్యాయి..
1950లో భూ చట్టాలు అమల్లోకి రావటంతో చాలా మంది కాశ్మీరీ పండిట్లు లోయను వదిలిపెట్టి వెళ్లిపోవటం మొదలైంది. 1981 నాటికి లోయలో కేవలం 5 శాతం పండిట్లు మాత్రమే మిగిలారు. అయితే, కాశ్మీర్ భారతదేశంలో కలిసి ఉండటం ఇష్టం లేని కొన్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలకు తెరతీశాయి. ఈ ఉద్యమాలకు హిందువులైన కాశ్మీరీ పండిట్లు అడ్డుగా ఉంటారని భావించాయి. అందుకే వారిని లోయనుంచి వెళ్లగొట్టాలని అనుకున్నాయి. అనుకున్నదే తడువుగా క్రూర చర్యలు మొదలుపెట్టాయి.
1989 టు 2003 మారణ హోమం..
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కాశ్మీరీ పండిట్లలో ప్రముఖులైన వారిని టార్గెట్ చేస్తూ వచ్చాయి. సెప్టెంబర్ నెల 1989లో రాజకీయ ఉద్యమకారుడు టీకా లాల్ టప్లూను కొందరు దుండుగులు ఆయన ఇంటి దగ్గర కాల్చి చంపారు. ఆ తర్వాత 1990 జనవరి 4న లోయలోని ఓ స్థానిక ఉర్థూ పేపర్‌లో ఓ ప్రకటన వచ్చింది. లోయలోని హిందువులంతా తట్టాబుట్టా సర్ధుకుని అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆ ప్రకటనలో ఉంది. ఈ ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే కాశ్మీర్ లోయలో అలజడులు మొదలయ్యాయి. కాశ్మీరీ పండిట్లను చంపటం మొదలైంది. ప్రార్థనా మందిరాల్లో కాశ్మీరీ పండిట్లకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడం.. ప్రార్థనల పేరిట బహిరంగ సభలు నిర్వహించి, ఆ సభల్లో కూడా కాశ్మీర పండిట్లను ఎలా లోయనుంచి తరమాలో అన్న దానిపై మాట్లాడేవారు. దీంతో కాశ్మీరీ పండిట్లకు భయం పట్టుకుంది.
జనవరి 19, 1990
జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పటానికి జగ్‌మోహన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవటానికి శ్రీనగర్ వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించారు. కానీ, దాని వల్ల ఎలాంటి లాభం లేకపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, హిజ్బుల్ ముజాహిద్దిన్ టెర్రరిస్టులు మసీదుల వద్ద ప్రజల్ని ఉద్ధేశించి మాట్లాడటం మొదలుపెట్టారు. కర్ఫ్యూను బ్రేక్ చేయాలని, వీధుల్ని ఆక్రమించాలని మసీదుకు వచ్చిన వారిని రెచ్చగొట్టారు. దీంతో ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు పండిట్లను భయభ్రాంతులను చేసే చర్యలకు పాల్పడ్డారు. బిక్కచచ్చిపోయిన పండిట్లు ఇండ్లలో తలుపులు వేసుకుని ఉండిపోయారు.
సాయంత్రానికి ఈ అలజడి మరింత పెరిగింది. లోయలోని మసీదుల్లో రాత్రిళ్లు మొత్తం పండిట్లకు వ్యతిరేకంగా లౌడ్ స్పీకర్లు పెట్టారు. కాశ్మీరి పండిట్లను ‘కాఫిర్లు’గా ప్రకటించారు. మగవారు లోయను వదిలిపెట్టి పోవాలని, లేదా మతం మార్చుకోవాలని హెచ్చరించారు. ఒక వేళ లోయను వదిలిపెట్టి పోవాలనుకుంటే వాళ్లు తమ ఆడవాళ్లను అక్కడే వదిలి పెట్టి పోవాలనే రూల్ పెట్టారు. తర్వాతి నెలనుంచి కాశ్మీర్ పండిట్లపై విరుచుకుపడ్డారు.
ఏ పాపం ఎరుగుని చాలా మంది పండిట్లను దారుణంగా హింసించారు. వందల మంది పండిట్లను హింసించి చంపారు. చాలా మంది మహిళలను రేప్ చేసి చంపేశారు. ఈ నేపథ్యంలో భయపడ్డ పండిట్లు లోయను వదిలి పారిపోవటం మొదలుపెట్టారు. 1990 సంవత్సరం ముగిసే సమయానికి 3,50,000 మంది పండిట్లు లోయను వదలిపెట్టారని అంచనా. ఎక్కడికీ పోలేక అక్కడే మిగిలిపోయిన కొంతమంది మాత్రం దినదిన గండం నూరేళ్ల ఆయుష్సుగా జీవితాన్నిగడుపుతూ వచ్చారు.
వెండితెరపై దుమ్మ రూపురేపుతున్న ‘ ది కశ్మీర్ ఫైల్స్’..
కాశ్మీరీ పండిట్లకు సంబంధించిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా వెండి తెరపై దుమ్మురేపుతోంది. దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ, రాజకీయ వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ సినిమాను ఓ వర్గం సమర్థిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ‘కాశ్మీరీ పండిట్ల’ పై సినిమా తీసిన వారు గుజరాత్ అల్లర్లపై సినిమా తీయగలరా అని ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా.. ఓ సినిమా కారణంగా చరిత్ర మర్చిపోయిన ఓ చేదు నిజంపై మళ్ళీ చర్చ మొదలైంది. నిజానికి కాశ్మీర్ పండితులపై ఈ విధంగా దాడి చేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కొంతమంది ముస్లింలను కూడా చంపాయి. “ప్రజల ప్రాణాలను తీయడం అన్యాయం. మేమంతా ఓ దేశంలో భాగమే. మీ దుర్మార్గమైన చర్యని ఆపండి అంటూ గొంతు ఎత్తిన ముస్లింలు కూడా ఈ సమయంలో ప్రాణాలను కోల్పోయారు”. మరి.. దేశ సమగ్రతని దెబ్బ తీసే విధంగా సాగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కశ్మీర్ ఫైల్స్ మూవీపై RGV ట్వీట్ వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.