ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ లో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్న (శుక్రవారం) సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే, ప్రచార సమయం ముగిసినా గానీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం చిర్వహించారు. కాగా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కేసు నమోదు అయ్యింది.
ఎన్నికల ప్రచారానికి తెరపడినప్పటికీ.. సీఎం చన్నీ, శుభ్ దీప్ సింగ్ మాన్సా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వాహించారని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంటనే మాన్సా నియోజకవర్గంలో తనిఖీ చేశారు. సీఎం చన్నీ అప్పటికే ప్రచారం ముగించుకుని ప్రార్థనల నిమిత్తం గురుద్వారాకు వెళ్లినట్టు స్థానికులు ఆ అధికారికి తెలిపారు.
ఇది చదవండి : పుజారాకి అవమానం! మరీ ఇంత దారుణమా?
మాన్సాలో ఓటు హక్కు లేనప్పటికీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం ఎన్నికల నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు తెలిపారు. నిఘా కెమెరాల ఫుటేజిని పరిశీలించి, సీఎం చన్నీ నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రముఖ పంజాబీ గాయకుడైన సిద్ధూ మూసేవాలా.. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మాన్సా నుంచి బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలకు ఈ నెల 20న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.