ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. గోవాలో ముందంజలో ఉంది. ఇక పంజాబ్‌లో ఆప్ భారీ విజయం సాధించింది. ఓ ప్రాంతీయ పార్టీ.. రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో ఆప్ జెండా ఎగురవేసింది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆప్ తరఫున బరిలో నిలిచిన అతి సామాన్యులు కూడా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సామాన్యుల చేతిలో.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు దారుణంగా ఓడిపోయారు.
పంజాబ్‌లో బరిలో నిలిచిన ఆప్.. వివిధ నియోజకవర్గాల్లో బలహీన వర్గాలకు చెందిన వారికి సీట్లు ఇచ్చి.. ఎన్నికల బరిలో నిలబెట్టింది. వారంతా కాంగ్రెస్ అగ్రనేతలను ఓడించారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. స్వీపర్ కుమారుడి చేతిలో ఓడిపోవడం ఆసక్తికరంగా మారింది. చన్నీపై భదౌర్ నుంచి ఆప్ తరఫున లాభ్ సింగ్ బరిలో నిలిచాడు. ఇక అతడి వివరాలకు వస్తే.. సీఎం చన్నీపై ఘన విజయం సాధించిన లాభ్ సింగ్ చాలా సాధారణ వ్యక్తి. ఇంటర్ వరకూ మాత్రమే చదువుకున్నారు. కొంతకాలం మొబైల్ రిపేర్ షాపులో కూడా పని చేశారు. అతడి తండ్రి ఒక వ్యవసాయ కూలీ, తల్లి స్వీపర్. 2013లో లాభ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఎన్నికల బరిలో దిగిన తర్వాత లాభ్ సింగ్ తన మాటలతో అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు.
లాభ్ సింగ్ గెలుపుపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సామాన్యులు తలచుకుంటే ఏమన్నా చేయగలరని ఆయన అన్నారు. “నేను ఏమి చేయగలను అని సామాన్యుడు భావిస్తున్నాడు..? ఈరోజు చరణ్ జిత్ సింగ్ చన్నీని ఎవరు ఓడించారో తెలుసా..? భదౌర్ నుంచి లాభ్ సింగ్. అతను మొబైల్ రిపేర్ షాపులో పనిచేస్తాడు. అతని తల్లి ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. అతని తండ్రి వ్యవసాయ కూలీ. అలాంటి వ్యక్తి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఓడించాడు”అని కేజ్రీవాల్ అన్నారు.
అలానే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూని ఆప్ తరఫున పోటీ చేసిన జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. జీవన్ జ్యోత్ కౌర్ ఒక సామాజిక కార్యకర్త. ఆమె పంజాబ్‌లోని పద్మినిగా ప్రసిద్ధి చెందారు. ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మహిళలకు అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యంగా ఆమె పెట్టుకున్నారు. అలా ఆమె సోషల్ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అంతేకాదు శ్రీ హేమకుంట్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. ఇది సమాజంలోని పేద, వెనుకబడిన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ. పంజాబ్ ఎన్నికల్లో సామాన్యులు సాధించిన ఈ అసమాన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.