యూట్యూబ్ అంటే కేవలం వినోదాన్ని పంచే సాధనం మాత్రమే కాదు.. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఇక లాక్‌డౌన్ కాలంలో.. ఇంటికో యూట్యూబ్ చానెల్ అన్నట్లుగా పరిస్థితి మారింది. వంటింటి చిట్కాలు మొదలు.. కంప్యూటర్ ప్రొగ్రామింగ్ వరకు యూట్యూబ్‌లో అందుబాటులో లేని సమాచారం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. టాలెంట్ ఉండి.. దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ప్రజెంట్ చేస్తే చాలు. ఆటోమెటిగ్గా వ్యూస్ పెరుగుతాయి. కావాల్సిందల్లా కాస్త కొత్తగా ఆలోచించడం మాత్రమే. ఇదుగో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ.. యూట్యూబ్ ఆదాయం ద్వారా లక్షాధికారిగా మారాడో యువకుడు. ఏకంగా యూట్యూబ్ ఆదాయం ద్వారా ఆడీ కారు కొన్నాడు అంటే.. యూట్యూబ్‌లో అతడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఎవరా యూట్యూబర్.. ఎలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తాడు వంటి విరాల కోసం..
బిహార్, ఔరంగాబాద్‌లోని జసోయా ప్రాంతానికి చెందిన 27ఏళ్ల హర్ష్ రాజ్ పూత్.. అనే యువకుడు కామెడీ వీడియోలు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్నాడు. అది కూడా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే.. లక్షాధికారిగా మారాడు హర్ష్. కరోనా, లాక్‌డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. అయితే అందుకు భిన్నంగా కొందరు యూట్యూబ్‌లో సత్తా చాటుతూ.. స్వయం ఉపాధి క్రియేట్ చేసుకున్నారు. వారిలో ఒకడు హర్ష్.
లాక్‌డౌన్ టైమ్‌లో పని లేకపోవడంతో యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చూస్తూ.. తాను కూడా అదే పని చేసి పేరు సంపాదించుకోవాలని భావించాడు. దానిలో భాగంగానే వెరైటీ వీడియోలు, ఫన్నీ కామెంట్స్, కామెడీని పంచే వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు హర్ష్. ఎంతలా ఉంటే ఏకంగా యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఓ ఆడికారు అంటే అక్షరాల 50లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ కారును కొనుక్కునే రేంజ్‌కి ఎదిగాడు.
ధాకడ్ అనే న్యూస్ రిపోర్టర్ పేరుతో సమాజంలోని అనేక ప్రజా సమస్యలపై కామెడీ వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో షేర్ చేస్తూ నెలకు 8లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు హర్ష్‌రాజ్‌పూత్. ప్రజా సమస్యలపై సెటైరికల్‌గా వీడియోలు చేయడంతో.. అనతి కాలంలోనే అతను చేస్తున్న వెరైటీ వీడియోలు, కామెడీ టైమింగ్ నచ్చడంతో సబ్‌స్క్రైబర్స్ విపరీతంగా పెరిగారు. ప్రస్తుతం హర్ష్ రాజ్ పుత్ చానెల్‌కి సుమారు 33లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలో హర్ష్.. నెలకు 8లక్షల రూపాయల ఆదాయం గడిస్తున్నాడు.
ఇక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. లగ్జరీ ఆడీ కారు అయితే కొన్నాడు కానీ.. దాన్ని పార్క్ చేయడం కోసం చోటు లేకపోతే.. దాన్ని తన పశువుల కొట్టంలో పెట్టాడు. ఇది చూసిన నెటిజనులు.. ఆడీ కారు కొన్నప్పటికి తన ప్రొఫెషనల్ వర్క్‌ని మాత్రం పక్కన పెట్టలేదు అని ప్రశంసిస్తున్నారు. చదువు, బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా.. స్వయం కృషితో ఎదిగిన హర్ష్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి హర్ష్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.