విధి చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరితో ఎలాంటి వింత ఆట ఆడుతుందో అస్సలు ఊహించలేము. తాజాగా బిహార్ కి చెందిన అవినాష్ అనే యువకుడి విషయంలో కూడా విధి ఇలానే ఓ వింత నాటకం ఆడింది. అవినాష్ ఓ బీటెక్ స్టూడెంట్. ఎంసెట్ లో అతనికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే అతను ఎంత బెస్ట్ స్టూడెంట్ అన్నది అర్ధం చేసుకోవచ్చు. బీటెక్ లో కూడా ఇలానే కష్టపడి చదివి మంచి సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. లక్షల్లో జీతం. కోరుకున్న సదుపాయాలు. కానీ.., ఇవేవి అవినాష్ సంతోషాన్ని ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఉద్యోగం సాధించి ప్రజలకి సేవ చేయాలని కలలు కనేవాడు అవినాష్.
తన ఆశయం తీవ్రంగా కష్టపడ్డాడు. ఈ ప్రాసెస్ లో తన సాఫ్ట్ వేర్ జాబ్ ని సైతం వదిలి పెట్టేశాడు. కోచింగ్ తీసుకుని.., మంచిగా ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకు హాజరయ్యాడు అవినాష్. పరీక్ష బాగా రాశానని తనకి ఉద్యోగం గ్యారంటీ అని సన్నిహితులకి చెప్పుకుని సంబరపడిపోయాడు. కానీ.., ఈ లోపే కరోనా రక్కసి అవినాష్ పై దాడి చేసింది.
వైరస్ సోకడంతో ఆస్ఫత్రిలో చికిత్స పొందిన అనంతరం అవినాష్ డిశ్చార్చ్ అయ్యాడు. కానీ.., కొన్ని రోజులకే అతనికి మాయదారి రోగం తిరగబెట్టింది. దీంతో.., జూన్ 24న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి.., అవినాష్ మృత్యువాత పడ్డాడు. కానీ.., విధి విచిత్రం ఏమిటో తెలుసా? అవినాష్ మరణించిన సరిగ్గా ఆరు రోజుల తర్వాత అతను రాసిన పరీక్షా ఫలితాలు వచ్చాయి.
జూన్ 30న విడుదలైన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో అవినాష్ డిప్యూటీ కలెక్టర్ లేదా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ హోదా ఉన్న ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ.., కోరుకున్న జాబ్ వచ్చిందని మురిసిపోవడానికి ఇప్పుడు అవినాష్ బతికి లేడు. జీవిత ఆశయంగా భావించిన ఉద్యోగాన్ని సాధించినా, తన బిడ్డ ఇప్పుడు బతికి లేకపోవడంతో అవినాష్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.