యూట్యూబర్ అవినాష్ తాజా వీడియోలో సంచలన నిజాలు వెల్లడించాడు. తనకు వచ్చిన రూ. 30 లక్షల ఆదాయం గురించి అసలు నిజం తెలిపాడు. కొత్తగా యూట్యూబర్లుగా మారే వారికి అలా చేయోద్దుంటూ సూచనలు చేశాడు.
వినూత్న ఆలోచనలతో వీడియోలు చేస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్ తో లక్షల్లో ఆదాయం సంపాదించిన యూట్యూబర్ అవినాష్ గురించి యూట్యూబ్ ఫాలో అయ్యే ప్రతిఒక్కరికి పరిచయమే. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి వింతలు విశేషాలను వీడియోల రూపంలో యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో చైనాలో పర్యటించిన అవినాష్ ఆ నెలకు సంబంధించి యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఏకంగా ఒక్క నెలలోనే రూ. 30 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలపడంతో అందరు షాక్ అయ్యారు. మేం కూడా యూట్యూబర్లుగా మారి లక్షల్లో సంపాదిస్తామని కొందరు సిద్దమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా అవినాష్ చెప్పిన విషయం తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే. ఆ సంపాదన వెనక ఉన్న నిజ నిజాలను తాజా వీడియోలో వెల్లడించారు. ఇంతకీ ఏం చెప్పాడంటే?
ఉత్తరాంధ్రకు చెందిన ఫేమస్ యూట్యూబర్ అవినాష్ యూట్యూబ్ ద్వారా తన సంపాదన గురించి, దాని వెనకాల ఉన్న కష్ట నష్టాల గురించి తాజాగా వివరించాడు. ప్రపంచ యాత్రికుడు అవినాష్ మాట్లాడుతూ.. నాకు సులువుగా రూ. 30 లక్షలు రాలేదు. దానికోసం రాత్రి, పగలు కష్టపడ్డానని తెలిపాడు. ఇవేమీ పట్టించుకోకుండా కొంతమంది నెలకు ముప్పై లక్షలు సంపాదించడం ఎలా అంటూ కోర్సులు ప్రారంభించారని, నిజానికి యూట్యూబ్ వీడియోల కోసం స్మార్ట్ ఫోన్ ఉంటే చాలని ఎలాంటి కోర్స్ అవసరం లేదని వెల్లడించాడు. నాలుగు సంవత్సరాలు శ్రమిస్తే దక్కిన ఫలితం ఆ 30 లక్షలు అని అవినాష్ తెలిపారు. ఛానల్ ప్రారంభించిన ప్రారంభంలో చాలా కష్ట నష్టాలు అనుభవించానని మొదట్లో ఓ వీడియోకు పది డాలర్లు మాత్రమే వచ్చాయని చెప్పాడు. కుటుంబాన్ని వదులుకుని విరామం లేకుండా పనిచేస్తే నాకు రూ. 30 లక్షలు వచ్చాయని తెలిపాడు. నన్ను చూసి గొర్రెల్లా మారొద్దని మీకు ఇష్టమైన పని మీరు చేయండని తెలిపాడు.
నేను చేస్తున్న పని నా చదువుకు సంబంధించింది కనుకనే ట్రావెలింగ్ చేస్తున్నాను అని అవినాష్ తెలిపాడు. ట్రావెలింగ్ టూరిజంలో పీజీ, బీఎస్సీ కంప్యూటర్స్ చేశానని కాబట్టి నాకు ఆ ఇంట్రెస్ట్ స్కిల్ ఉన్నాయి కాబట్టే యూట్యూబ్ లో రాణిస్తున్నానని తెలిపాడు. అందరూ నాకు వచ్చిన రూ. 30 లక్షల గురించే మాట్లాడుతున్నారు గానీ దాని వెనకాల ఉన్న కష్ట నష్టాల గురించి ఆలోచిస్తలేరని అన్నారు. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు టైమ్ కు నిద్ర లేక సరియైన తిండిలేక నరకం చూశానని తెలిపాడు. కాబట్టి కొత్తగా యూట్యూబ్ కు వచ్చే వారు ఇవన్నీ తెలుసుకుని రావాలని కోరాడు. ముందుగా చదువు పూర్తి చేసుకొని, ఆ తరువాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ గురించి ఆలోచించండి అంటూ అవినాష్ సలహాలు ఇచ్చాడు.