టోక్యో పారాలింపిక్స్ 2020లో సోమవారం భారత్ అథ్లెట్‌లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో భారత అథ్లెట్ సుమిత్ అటిల్ ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సుమిత్ అత్యద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. సుమిత్ తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 66.95 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 68.08 మీటర్లు విసిరి తన పేరు మీద నమోదైన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను మరింత వేగంగా విసిరి 68.55 మీటర్ల ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేశాడు. ఇక, 66.29 మీటర్ల త్రోతో ఆస్ట్రేలియా అథ్లెట్ మైఖల్ బురియన్ రజతం, 65.61 మీటర్లు విసిరి శ్రీలంకకు చెందిన అథ్లెట్ దులాన్ కాంస్యం దక్కించుకున్నారు.
సుమిత్ అటిల్ సొంతూరు హర్యానాలోని సోనేపట్. 2015 వరకు మాములుగానే ఉన్న సుమిత్ ఓ బైక్ ప్రమాదంలో తన ఎడమకాలను పోగొట్టుకున్నాడు. అప్పటినుంచి కృతిమ కాలుతో జీవితాన్ని సాగిస్తున్నాడు. 2018లో పురుషుల జావెలెన్ త్రో ఎఫ్ 64 విభాగంలో పోటీ పడటం ప్రారంభించాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఇలా మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే స్థాయికి ఎదిగాడు సుమిత్ అటిల్. మరోవైపు భారత్‌కు ఇవాళ ఇది రెండో స్వర్ణం కావడం మరో విశేషం.