సిద్దిపేట- సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతానికి రోడ్డు కావాలని, లేదంటే ఆస్పత్రి కావాలని, పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉగ్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వాన్ని కోరడం సహజం. మామూలుగా ఐతే సర్పంచ్ నుంచి మొదలు ఎంపీ వరకు ఈవే కోరుకుంటారు. కానీ ఓ ఎంపీ మాత్రం తమ ప్రాంతానికి ఓ పబ్ కావాలని కోరుకున్నాడు. అది కూడా ఓ మంత్రికి విజ్ఞప్తి చేశాడు.
అవును టీఆర్ఎస్ పార్టీకి చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ ఊహించని కోరిక కోరాడు. సిద్దిపేట పట్టణంలో ఓ పబ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆయన డిమాండ్ విని స్థానికులు తెల్లమొహాలు వేశారు. సిద్దిపేటలో జరిగిన టూరిజం హోటల్ ప్రారంభోత్సవానికి ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. సిద్దిపేటకి అన్నీ చేశారు..నాదొక చిన్న విన్నపం.. నా దగ్గర కొందరు యువతులు రెండు, మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు.. అన్నా.. సిద్దిపేటలో పబ్స్ లేవు.. అందువల్ల మేం రోజూ సాయంత్రం హైదరాబాద్ పోవాల్సి వస్తోంది.. రాత్రికి తిరిగివచ్చేటప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు.. అందువల్ల సిద్దిపేటలోనే పబ్ ఏర్పాటు చేస్తే యువతకు మేలు చేసినట్లవుతుందని నాకు చెప్పారు.. అందువల్ల ప్రభుత్వం యువత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సిద్దిపేట పబ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా,, అని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విన్వవించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు విన్న మంత్రి హరీశ్‌రావు అవాక్కయ్యారు. ఎంపీ మాటలకు ఏంచెప్పాలో తెలియక ఓ నవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరికపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతతకు నెలవైన సిద్దిపేటకు విష సంస్కృతి అలవాటు చేయాలనుకుంటున్నారా.. అంటూ కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.